జగ్గారెడ్డిపై కేసు నమోదు
జగ్గారెడ్డిపై కేసు నమోదు
- పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తత
- సీఐపై ఆరోపణలు
- న్యాయస్థానంలో తేలుతుందని జగ్గారెడ్డి వ్యాఖ్య
సంగారెడ్డి, ఫిబ్రవరి 12 (పీపుల్స్ మోటివేషన్): పురపాలక ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సంబంధిత అధికారుల ఫిర్యాదు మేరకు సంగారెడ్డి పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహితలోని 223, 351, 352, 132, 329 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
బుధవారం జరిగిన పోలింగ్ సమయంలో సంగారెడ్డిలోని 34వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గల్లా పట్టి ఈడ్చుకెళ్లారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. సమాచారం అందుకున్న జగ్గారెడ్డి తన అనుచరులతో పోలింగ్ బూత్‌కు చేరుకుని పోలీసుల చర్యలను ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలింగ్‌ను ఆపేస్తామని హెచ్చరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు జగ్గారెడ్డితో పాటు కార్యకర్తలను అడ్డుకున్నారు.
తనపై కేసు నమోదు చేయడంపై జగ్గారెడ్డి స్పందిస్తూ, దొంగ ఓట్లను అడ్డుకున్న తమ నేతపై సీఐ దాడి చేశారని ఆరోపించారు. తమ అభ్యర్థిని కొట్టినందుకే సీఐని తిట్టాల్సి వచ్చిందని తెలిపారు. సీఐ శివకుమార్ బీఆర్ఎస్ అభ్యర్థికి సహకరించారని ఆరోపించారు. ఎన్నికల నిబంధనలను ఎవరైనా ఉల్లంఘించినా చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనలో తప్పు ఎవరిదో న్యాయస్థానంలో తేలుతుందని స్పష్టం చేశారు.
అదేవిధంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా పోస్టులపై కూడా జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ నేతలు పోలీసులపై ప్రవర్తించిన తీరు గురించి ముందుగా మాట్లాడాలని సూచించారు. నిన్నటి ఘటనను తాను అక్కడితో వదిలేశానని, అయితే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. మొత్తంగా ఈ ఘటనతో సంగారెడ్డిలో రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది.
