పోలవరం–నల్లమల సాగర్ అనుసంధానంతో రెండు రాష్ట్రాలకు మేలు
పోలవరం–నల్లమల సాగర్ అనుసంధానంతో రెండు రాష్ట్రాలకు మేలు
- గోదావరి వరద జలాలే తరలింపు
- మే 15 నుంచే నారుమళ్లకు నీరు
- ప్రాజెక్టుల పూర్తి పై త్వరలో ప్రణాళిక
అమరావతి, ఫిబ్రవరి 26 (పీపుల్స్ మోటివేషన్): పోలవరం–నల్లమల సాగర్ అనుసంధాన ప్రాజెక్టుతో ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వృథాగా సముద్రంలో కలిసిపోతున్న గోదావరి వరద జలాలను మాత్రమే ఈ ప్రాజెక్టు ద్వారా తరలిస్తామని ఆయన శాసనసభలో వివరించారు. గోదావరిపై ఎగువ రాష్ట్రం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై తాము ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని గుర్తుచేశారు. ఈ అనుసంధానం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలకూ మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో నీటి భద్రత కోసం కూటమి ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు సాగుతోందని సీఎం తెలిపారు. 2047 స్వర్ణాంధ్ర విజన్‌లో భాగంగా నీటికి అత్యున్నత ప్రాధాన్యం ఇస్తున్నామని, పరిశ్రమలు, పెట్టుబడులకు నీరే కీలకమని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర జలాశయాల్లో 793 టీఎంసీల నీరు నిల్వ ఉందని, అందుకే ఈసారి పంటల సీజన్‌ను ముందుకు జరిపి వచ్చే ఏడాది మే 15 నుంచే నారుమళ్లకు నీరందించేలా ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు. రైతులను చైతన్యవంతం చేయాలని ప్రజాప్రతినిధులకు సూచించారు.
2014–19 మధ్య సాగునీటి రంగానికి 68 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని సీఎం పేర్కొన్నారు. ఎన్టీఆర్ కాలంలో రాయలసీమకు తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా వంటి ప్రాజెక్టులు వచ్చాయని గుర్తుచేశారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లు అందించి, శ్రీశైలంలో నుంచి 100 టీఎంసీల నీటిని రాయలసీమకు తరలించామని తెలిపారు. రాష్ట్రంలో నిర్మించిన ప్రధాన సాగునీటి ప్రాజెక్టులన్నీ తమ హయాంలోనే అమలయ్యాయని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన సీఎం, వెలిగొండ ప్రాజెక్టుకు నీళ్లు రాకముందే రిబ్బన్ కట్ చేసి క్రెడిట్ తీసుకున్నారని అన్నారు. ఆ ప్రాజెక్టు మొదటి దశను ఈ ఏడాది జూలైలో పూర్తి చేసి నీరందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును పునరుద్ధరించి వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు. ప్రస్తుతం జలాశయాలు కళకళలాడుతున్నాయని, భూగర్భ జలాలు సగటున ఆరు మీటర్లు పెరిగాయని వెల్లడించారు. ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రతి ఇంటికీ తాగునీరు, పరిశ్రమలకు అవసరమైన నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం పునరుద్ఘాటించారు.
