రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఒత్తిడి తగ్గించాలి

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

ఒత్తిడి తగ్గించాలి

  • సామూహిక మైదానాల ప్రతిపాదన
  • శారీరక దృఢత్వం అవసరం
  • ప్రైవేట్ పాఠశాలలకు అవకాశం
  • యువత సమగ్రాభివృద్ధి లక్ష్యం
  • ఎమ్మెల్సీ కోన నాగబాబు

అమరావతి, ఫిబ్రవరి 17 (పీపుల్స్ మోటివేషన్): విద్యార్థుల్లో పెరుగుతున్న మానసిక ఒత్తిడిని తగ్గించి వారిని శారీరకంగా దృఢంగా తీర్చిదిద్దేందుకు విద్యా వ్యవస్థలో కీలక మార్పులు తీసుకురావాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కోన నాగబాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో మాట్లాడిన ఆయన ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థుల కోసం సామూహిక క్రీడా మైదాన విధానం అమలు చేయాలని ప్రతిపాదించారు. ఆటస్థలాలు లేక నాలుగు గోడల మధ్యే చదువుకు పరిమితమవుతున్న విద్యార్థుల శ్రేయస్సు కోసం తక్షణ చర్యలు అవసరమని పేర్కొన్నారు. పిల్లల్లో అపారమైన శక్తి దాగి ఉందని, ఆ శక్తిని సరైన దిశలో మళ్లిస్తే వారు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని నాగబాబు అన్నారు. వారంలో కనీసం మూడు రోజులైనా శారీరక దృఢత్వం, క్రీడలు, సహ పాఠ్య కార్యక్రమాలకు సమయం కేటాయించాలని సూచించారు. ముఖ్యంగా ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారని, దాని ప్రభావం వారి మానసిక, శారీరక ఆరోగ్యంపై పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒత్తిడి తట్టుకోలేక కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

చాలా ప్రైవేట్ విద్యాసంస్థలకు స్వంతంగా క్రీడా మైదానాలు లేవని, ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం విశాలమైన మైదానాలు అందుబాటులో ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో సామూహిక క్రీడా మైదాన విధానాన్ని అమలు చేస్తే జిల్లా పరిషత్, మునిసిపల్, కార్పొరేషన్ పాఠశాలల మైదానాలను ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులు కూడా వినియోగించుకోవచ్చని వివరించారు. ఇందుకోసం ప్రైవేట్ యాజమాన్యాల నుంచి కనీస రుసుము వసూలు చేసి ఆ మొత్తాన్ని సంబంధిత ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య సిబ్బంది నియామకం, మైదానాల నిర్వహణకు వినియోగించాలని సూచించారు. దీనివల్ల ప్రభుత్వ, ప్రైవేట్ విద్యార్థుల మధ్య సత్సంబంధాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. శారీరక దృఢత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లను ఉదాహరణగా చూపారు. వయసు పెరిగినా చురుకుదనం కోల్పోకుండా యోగా, వ్యాయామంతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పాలన సాగిస్తున్నారని ప్రశంసించారు. యువత ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగి ఉండాలని స్వామి వివేకానంద సందేశాన్ని గుర్తుచేస్తూ, విద్యార్థులను కేవలం పుస్తకాలపైనే పరిమితం చేయకుండా శారీరకంగా, మానసికంగా బలమైన వారిగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. చదువుతో పాటు శారీరక దృఢత్వం, యోగా, స్వీయ రక్షణ విద్యలను పాఠ్యాంశాల్లో భాగం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌లను సభ ద్వారా కోరారు.

Comments

-Advertisement-