బలూచ్ తిరుగుబాటుదారుల వద్ద పాక్ సైన్యంకంటే శక్తివంతమైన ఆయుధాలు
బలూచ్ తిరుగుబాటుదారుల వద్ద పాక్ సైన్యంకంటే శక్తివంతమైన ఆయుధాలు
బలూచిస్తాన్‌లో పట్టుకోల్పోతున్న పాకిస్తాన్ ఆర్మీ
తీవ్ర పరిణామాల హెచ్చరిక : పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్
ఇస్లామాబాద్, ఫిబ్రవరి 4 (పీపుల్స్ మోటివేషన్):
పాకిస్తాన్ సైన్యంకంటే బలూచ్ తిరుగుబాటుదారుల వద్దే అత్యాధునిక, ప్రభావవంతమైన ఆయుధాలు ఉన్నాయని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బలూచిస్తాన్ ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీ క్రమంగా ఆధిపత్యాన్ని కోల్పోతున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు బలూచ్ తిరుగుబాటుదారుల వద్ద రెండు మిలియన్ డాలర్ల విలువైన రైఫిళ్లు ఉన్నాయని, అలాంటి ఆయుధాలు పాక్ సైన్యం వద్ద కూడా లేవని ఖవాజా ఆసిఫ్ వెల్లడించారు. ఒక్కోటి నాలుగు లక్షల యాభై వేల రూపాయల విలువైన థర్మల్ ఆయుధాలు కూడా వారి వద్ద ఉన్నాయని చెప్పారు. అంతేకాకుండా కొన్ని అమెరికన్ ఆయుధాలు సైతం వారు ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. ఒక్కో తిరుగుబాటుదారుడి వద్ద ఇరవై వేల డాలర్ల విలువైన గేర్ ఉందని తెలిపారు.
ఇంతటి ఆధునిక ఆయుధాలు వారికి ఎక్కడి నుంచి వస్తున్నాయనే ప్రశ్నను ఖవాజా ఆసిఫ్ లేవనెత్తారు. ఈ తరహా ఉగ్రవాద సంస్థల నాయకులు ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నారని ఆరోపించారు. నేరగాళ్లతో సంబంధాలు ఉన్నవారితో చర్చలు జరపబోమని స్పష్టం చేశారు. బీఎల్ఏ పేరుతో దాడులు జరుగుతున్నాయని, ఈ సంస్థకు భారత్‌తో సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. బలూచ్ తిరుగుబాటుదారులు దాడులు ఆపకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. పాకిస్తాన్ సైన్యం, బలూచిస్తాన్ తిరుగుబాటుదారుల మధ్య కొన్నేళ్లుగా తీవ్ర ఘర్షణలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత నెల ముప్పై ఒకటిన పాక్ ఆర్మీకి, బలూచ్ తిరుగుబాటుదారులకు మధ్య భీకర యుద్ధం జరిగింది. పాక్ భద్రతా దళాలపై బీఎల్ఏ మెరుపు దాడులు చేయడంతో పాటు ఆత్మాహుతి దాడులకు కూడా పాల్పడింది. ఈ ఘర్షణల్లో ఇరువైపులా భారీగా ప్రాణనష్టం జరిగింది. వంద మందికి పైగా పాక్ భద్రతా సిబ్బంది మృతి చెందగా, సుమారు నూట డెబ్బై మంది వరకు బలూచ్ తిరుగుబాటుదారులు మరణించినట్లు సమాచారం. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న బలూచిస్తాన్ ప్రాంతాన్ని 1948లో పాకిస్తాన్‌లో కలిపారు. అప్పటి నుంచి పాక్ నుంచి స్వాతంత్ర్యం కావాలనే డిమాండ్‌తో బలూచ్ తిరుగుబాటుదారులు పోరాటం కొనసాగిస్తున్నారు. బలూచిస్తాన్‌లో అపారమైన ఖనిజ వనరులు ఉండటంతో వాటిపై పాకిస్తాన్ కన్నేయడమే ఈ ఘర్షణలకు ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
