ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ
- హామీల అమలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్
- బడ్జెట్‌లో ఆరు హామీలకు భారీ కేటాయింపులు చేయాలన్న విజ్ఞప్తి
- అమలు లేకపోతే ప్రజల తరఫున పోరాటం హెచ్చరిక
హైదరాబాద్, 19 ఫిబ్రవరి (పీపుల్స్ మోటివేషన్): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సగం కాలం పూర్తవుతున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో తొంభై ఐదు శాతం ఇప్పటికీ అమలుకాలేదని ఆరోపిస్తూ, ఈసారి బడ్జెట్‌లో అయినా తగిన నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు బడ్జెట్లలోనూ హామీల అమలుకు సరైన కేటాయింపులు చేయలేదని విమర్శించిన కేటీఆర్, రాబోయే రెండు వేల ఇరవై ఆరు – రెండు వేల ఇరవై ఏడు ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో స్పష్టమైన కేటాయింపులు చేయాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆరు హామీల పేరుతో అధికారంలోకి వచ్చి వాటి అమలును పక్కన పెట్టడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు.
మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, యువత, రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలంటే భారీ నిధులు అవసరమని తెలిపారు. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు డిక్లరేషన్ల ద్వారా ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడానికి ఈ బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు చేయాలని కోరారు. గత రెండు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆరు హామీలకు చట్టబద్ధత తీసుకువస్తామని చెప్పిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈసారి కూడా నిధులు కేటాయించకపోతే ప్రజల తరఫున ప్రభుత్వం పై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తామని, ఎక్కడికక్కడ కాంగ్రెస్‌ను నిలదీస్తామని హెచ్చరించారు.

