అసెంబ్లీలో ప్రతిపక్షానికి మైక్ నిరాకరణపై విమర్శలు
అసెంబ్లీలో ప్రతిపక్షానికి మైక్ నిరాకరణపై విమర్శలు
- మైనింగ్ అంశంపై మాట్లాడనివ్వడంలేదని ఆరోపణ
- ప్రభుత్వ వైఖరిపై సునీతా లక్ష్మారెడ్డి ఆగ్రహం
- అక్రమ మైనింగ్ అంశం దారి మళ్లిస్తున్నారన్న వ్యాఖ్యలు
హైదరాబాద్, మార్చి 29 (పీపుల్స్ మోటివేషన్):
అసెంబ్లీలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వడంలేదని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తీవ్రంగా విమర్శించారు. నిన్న, ఈరోజు ప్రతిపక్ష సభ్యులు మాట్లాడాలని ప్రయత్నించినప్పటికీ మైక్ ఇవ్వలేదని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులపై మాత్రమే మాట్లాడితే మైక్ ఇస్తామని, మైనింగ్ వంటి కీలక అంశాలపై మాట్లాడితే అవకాశం ఇవ్వడంలేదని ఆమె అన్నారు. ప్రతిపక్షం కూడా ప్రభుత్వం చెప్పినట్టే నడవాలని ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు.
ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నారన్న ప్రశ్న అడిగితే కాంగ్రెస్ సభ్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారని సునీతా లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ప్రశ్నలు అడిగే హక్కును కూడా నిరోధిస్తున్నారని ఆరోపించారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఉన్న అక్రమ మైనింగ్ ఆరోపణలను పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజల సమస్యలు, అవినీతి అంశాలను ప్రస్తావించకుండా అడ్డుకోవడం సరైంది కాదని ఆమె స్పష్టం చేశారు. అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షానికి మాట్లాడే హక్కు ఉండాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీరును మార్చుకోకపోతే ప్రజల ముందుకు ఈ విషయాలను తీసుకెళ్తామని సునీతా లక్ష్మారెడ్డి హెచ్చరించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని ఆమె పిలుపునిచ్చారు.
