వరంగల్‌లో రంజాన్ వేడుకలు.. మత సామరస్యానికి నిదర్శనం
వరంగల్‌లో రంజాన్ వేడుకలు.. మత సామరస్యానికి నిదర్శనం
- ఈద్గాల్లో ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు
- మైనారిటీల అభివృద్ధికి భారీ నిధులు
- స్వయం ఉపాధికి పలు సంక్షేమ కార్యక్రమాలు
- మంత్రి కొండా సురేఖ
వరంగల్, మార్చి 21 (పీపుల్స్ మోటివేషన్): సేవాభావానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే రంజాన్ పండుగను వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. మట్టేవాడ, ఎల్బీ నగర్, ఖిలా వరంగల్ ఈద్గాల్లో జరిగిన వేడుకల్లో మంత్రి కొండా సురేఖ ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులతో మమేకమై రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. పవిత్ర రంజాన్ మాసంలో నెల రోజుల పాటు ఉపవాసాలు ఆచరించి, ఆధ్యాత్మికతతో పండుగను జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికీ ఆమె హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, సమాజంలో ఐక్యతను మరింత బలపరుస్తుందని పేర్కొన్నారు. ఈ పండుగ మనుషుల మధ్య ప్రేమ, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తుందని అన్నారు.
ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల అభ్యున్నతి, సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. మైనారిటీల అభివృద్ధి కోసం పలు కీలక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈద్గాల అభివృద్ధి కోసం మట్టేవాడ, ఖిలా వరంగల్ ప్రాంతాలకు ఒక్కొక్కటి రూ.1 కోటి, ఎల్బీ నగర్‌కు రూ.60 లక్షలు, చింతల్ ఈద్గాకు రూ.40 లక్షలు కేటాయించి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. అలాగే ముస్లిం సోదర సోదరీమణుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో 400 కుట్టు యంత్రాలను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. రంజాన్ తోఫా కింద 3,500 కిట్లను అందజేసి పండుగ సందర్భంగా అవసరాలను తీర్చేందుకు సహకరించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఈద్గాల్లో ప్రార్థనల్లో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. మొత్తంగా రంజాన్ వేడుకలు వరంగల్‌లో సామరస్యానికి ప్రతీకగా నిలిచాయి.
