పాఠశాలలో మధ్యాహ్న భోజనంపై ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ
పాఠశాలలో మధ్యాహ్న భోజనంపై ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ
- మెనూ పాటించలేదని నిర్వాహకులపై ఆగ్రహం
- విద్యార్థులతో కలిసి భోజనం చేసి నాణ్యతపై అసంతృప్తి
- లోపాలు సరిచేయకపోతే కఠిన చర్యలు హెచ్చరిక
కంబదూరు, మార్చి 31 (పీపుల్స్ మోటివేషన్): కంబదూరు మండలం రాళ్లనంతపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ తనిఖీ చేపట్టారు. తరగతి గదులు, వసతులు, భోజన ఏర్పాట్లను ఎమ్మెల్యే సమగ్రంగా పరిశీలించారు.
తనిఖీ సందర్భంగా విద్యార్థులతో నేరుగా మాట్లాడిన ఎమ్మెల్యే, వారి సమస్యలను తెలుసుకున్నారు. మార్నింగ్ స్కూల్ కారణంగా మధ్యాహ్నం 12.30 తర్వాతే భోజనం అందుతున్నదని, దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థులు తెలిపారు. వెంటనే ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే, భోజన సమయాన్ని ముందుకు జరపాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా వంటగదిని పరిశీలించిన ఎమ్మెల్యే, నేటి మెనూ ప్రకారం పులిహోర, టమోటా చట్నీ, ఎగ్ ఫ్రై ఇవ్వాల్సి ఉండగా అది సరిగా పాటించలేదని గుర్తించారు. పులిహోర నాణ్యత కూడా తక్కువగా ఉందని పేర్కొంటూ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎగ్ ఫ్రై బదులుగా ఉడికించిన గుడ్డు ఇవ్వడం ఎందుకని ప్రశ్నించినా సరైన సమాధానం రాలేదని అన్నారు. విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే స్వయంగా భోజనం చేసి నాణ్యతను పరిశీలించారు. భోజనం సరైన ప్రమాణాలకు అనుగుణంగా లేదని స్పష్టం చేశారు. గుడ్డు నాణ్యత కూడా తక్కువగా ఉందని పేర్కొంటూ, సరఫరా చేసే ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారికి ఆదేశించారు.
విద్యార్థుల కోసం తన స్వంత నిధులతో 26 వేల రూపాయల విలువైన 80 యోగా మ్యాట్లు అందజేశారు. పాఠశాలలో ఫ్లోరింగ్, టాయిలెట్లు, వంటగది వంటి పనులను కూడా స్వంత నిధులతో పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో నాడు-నేడు కార్యక్రమంలో పనులు అసంపూర్తిగా వదిలేశారని విమర్శించారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో ఎలాంటి రాజీ ఉండదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచించిన విధంగా సన్నబియ్యం, మెరుగైన మెనూతో భోజనం అందించాల్సిన బాధ్యత నిర్వాహకులదని అన్నారు. ఎక్కడైనా నాణ్యత లోపించినా, మెనూ పాటించకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

