గద్దర్ అవార్డు విజేతలకు నాగార్జున అభినందనలు
గద్దర్ అవార్డు విజేతలకు నాగార్జున అభినందనలు
హైదరాబాద్, మార్చి 7 (పీపుల్స్ మోటివేషన్):
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 2025 సంవత్సరానికి సంబంధించిన ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డు విజేతలందరికీ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున హృదయపూర్వక అభినందనలు తెలిపారు. గత ఏడాది సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రాలను పరిశీలించిన జ్యూరీ ‘తండేల్’ చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచిన అక్కినేని నాగచైతన్యను ఉత్తమ నటుడిగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. నాగచైతన్య కెరీర్‌లో ఇది రెండో రాష్ట్ర స్థాయి అవార్డు కావడం విశేషంగా నిలిచింది. గతంలో ‘మనం’ సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డు అందుకున్న ఆయన, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి తొలి గద్దర్ అవార్డును అందుకోబోతున్నారు.
ఈ సందర్భంగా నాగచైతన్యకు అభినందనలు తెలుపుతూ నాగార్జున సామాజిక మాధ్యమం ద్వారా స్పందించారు. 2025 గద్దర్ అవార్డు విజేతలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ తన కుమారుడు సాధించిన విజయంపై గర్వంగా ఉందని పేర్కొన్నారు. “దుమ్ములేపావు నాన్న.. నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది” అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన కుమారుడు కష్టపడి సాధించిన విజయానికి తగిన గుర్తింపు దక్కిందని ఆయన పేర్కొన్నారు.
అదే సమయంలో తన తండ్రి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు పేరు మీదుగా ఏఎన్నార్ అవార్డును ప్రారంభించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి నాగార్జున కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డు నిజంగా అక్కినేని నాగేశ్వరరావుకు తగిన గౌరవమని పేర్కొంటూ, ఈసారి ఆ అవార్డు అందుకున్న ప్రముఖ నటి జయసుధకు కూడా అభినందనలు తెలిపారు.
