ఏపీ జలాల్లో తమిళనాడు బోట్ల చొరబాటు… కేంద్రంగా వివాదం
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
ఏపీ జలాల్లో తమిళనాడు బోట్ల చొరబాటు… కేంద్రంగా వివాదం
- అక్రమ వేటపై ఏపీ ఆందోళన
- తక్షణ చర్యలు తీసుకోవాలని తమిళనాడుకు లేఖ
- మత్స్యకారుల జీవనోపాధిపై ప్రభావం
అమరావతి, మార్చి 22 (పీపుల్స్ మోటివేషన్): ఆంధ్రప్రదేశ్ సముద్ర జలాల్లోకి తమిళనాడుకు చెందిన మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్లు అక్రమంగా ప్రవేశించి వేట సాగించడం పై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యను సీరియస్‌గా తీసుకున్న అధికారులు, తమిళనాడు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఏపీ ఫిషరీస్ కమిషనర్ రామ శంకర్ నాయక్ తమిళనాడు ఫిషరీస్ అండ్ ఫిషర్‌మెన్ వెల్ఫేర్ డైరెక్టర్‌కు లేఖ రాశారు. తమిళనాడు బోట్ల చొరబాట్లు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని, దీని వల్ల స్థానిక మత్స్యకారుల జీవనోపాధికి తీవ్ర ముప్పు ఏర్పడుతోందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ పరిస్థితులు భవిష్యత్తులో శాంతిభద్రతల సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మార్చి 18న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన ఘటనను కూడా ఆయన ప్రస్తావించారు. పోలీసుల అదుపులో ఉన్న నాలుగు ఫిషింగ్ బోట్లను పుదుచ్చేరికి చెందిన మత్స్యకారులు బలవంతంగా తీసుకెళ్లినట్లు వివరించారు. ఈ ఘటనతో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోని 162 మత్స్యకార గ్రామాల్లో తీవ్ర ఆందోళన నెలకొందని తెలిపారు.
ఇదే సమస్యపై గతంలో 2022, 2023, 2025 సంవత్సరాల్లో కూడా తమిళనాడు అధికారులకు లేఖలు రాసిన విషయాన్ని గుర్తుచేశారు. అయినప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ సమస్య మరింత తీవ్రమవుతోందని పేర్కొన్నారు. తమిళనాడు బోట్లు ట్రాలింగ్ వంటి విధ్వంసకర పద్ధతుల్లో వేట సాగించడం వల్ల సముద్ర పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతోందని రామ శంకర్ నాయక్ తెలిపారు. దీని ప్రభావంగా తాబేళ్లు, ఇతర అరుదైన సముద్ర జీవులు మరణించి వాటి కళేబరాలు ఏపీ తీరానికి కొట్టుకొస్తున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో అక్రమ వేటను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేసింది.
Comments
