మావోయిస్టులకు శాంతి పిలుపు..
మావోయిస్టులకు శాంతి పిలుపు..
- సమాజంలోకి రావాలని డీజీపీ విజ్ఞప్తి
- ఆయుధాలు వదిలి సాధారణ జీవితం గడపాలి
- పునరావాసానికి పూర్తి హామీ
- కుటుంబాల సహకారంతో మార్పు అవసరం
హైదరాబాద్, మార్చి 30 (పీపుల్స్ మోటివేషన్): అజ్ఞాతంలో కొనసాగుతున్న మావోయిస్టులు ఇకైనా హింసా మార్గాన్ని విడిచి సమాజంలోకి రావాలని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయుధ పోరాటం వల్ల సాధారణ ప్రజలకే నష్టం జరుగుతోందని, శాంతి మార్గమే స్థిరమైన పరిష్కారమని స్పష్టం చేశారు. మావోయిస్టు నాయకులు, కేడర్ తమ కుటుంబాలతో కలిసి సాధారణ జీవన విధానంలో భాగస్వాములు కావాలని సూచించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కూడా వారిని శాంతి మార్గం వైపు ప్రోత్సహించాలని కోరారు. సమాజంలో కలిసే మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా భవిష్యత్తు మెరుగుపడుతుందని తెలిపారు.
లొంగిపోయే వారికి ప్రభుత్వం తరఫున పూర్తి భద్రత, గౌరవం కల్పించబడుతుందని డీజీపీ హామీ ఇచ్చారు. పునరావాస పథకాల కింద ఆర్థిక సహాయం, ఉద్యోగ అవకాశాలు, నివాస సదుపాయాలు వంటి అన్ని విధాల సహకారం అందించనున్నట్లు వెల్లడించారు. కొత్త జీవితం ప్రారంభించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో వివిధ మావోయిస్టు నిర్మాణాల్లో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన కేడర్ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి, శాంతి పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హింసా మార్గం కొనసాగిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని హెచ్చరించారు.
అజ్ఞాతంలో ఉన్న ప్రముఖ మావోయిస్టు నాయకుల పేర్లను కూడా వెల్లడిస్తూ, వారందరూ సమాజంలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. శాంతి, అభివృద్ధి మార్గంలో నడిచే వారికి ప్రభుత్వం అన్ని విధాల మద్దతు అందిస్తుందని తెలిపారు. గత రెండు సంవత్సరాల్లో 721 మంది మావోయిస్టులు లొంగిపోయారని, వారికి సమగ్ర పునరావాస పథకాల ద్వారా సహాయం అందించామని డీజీపీ పేర్కొన్నారు. ఈ మార్గాన్ని మరింత మంది ఎంచుకోవాలని సూచిస్తూ, శాంతియుత సమాజ నిర్మాణానికి అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
