రామతీర్థం గిరి ప్రదక్షిణ మార్గం ప్రారంభం
రామతీర్థం గిరి ప్రదక్షిణ మార్గం ప్రారంభం
- నవమికి ముందే భక్తులకు సౌకర్యం అందుబాటులోకి
- రూ.3.40 కోట్లతో రహదారి నిర్మాణం
- ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబాటు
- ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి
విజయనగరం, మార్చి 25 (పీపుల్స్ మోటివేషన్): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో గిరి ప్రదక్షిణ మార్గాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్‌గా ప్రారంభించారు. విజయనగరం జిల్లా నెలిమర్ల నియోజకవర్గంలోని ఈ ప్రాజెక్టు ద్వారా భక్తులకు సౌకర్యవంతమైన రహదారి అందుబాటులోకి వచ్చింది. శ్రీరామ నవమికి ముందే ఈ మార్గాన్ని ప్రారంభించడం విశేషంగా నిలిచింది.
సీతారాముని పేట కూడలి నుంచి నీలాచలం కొండ వరకు సుమారు 3.70 కిలోమీటర్ల మేర ఈ రహదారిని రూ.3.40 కోట్ల ఉపాధి హామీ నిధులతో నిర్మించారు. గతంలో రాళ్లు, ముళ్ల కంపలతో నిండిన ఈ మార్గంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడేవారని, ఇప్పుడు బీటీ రోడ్డు నిర్మాణంతో ఆ సమస్యలు తొలగిపోయాయని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రామతీర్థం భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా గుర్తింపు పొందిందన్నారు. రామాయణ, మహాభారత కాలానికి చెందిన ఆనవాళ్లు ఉన్న ఈ ప్రాంతంలో గిరి ప్రదక్షిణ చేయడం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగిస్తుందని పేర్కొన్నారు. వైకుంఠ ఏకాదశి, శివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకుంటారని తెలిపారు. గతంలో ఈ మార్గంలో ఉన్న ఇబ్బందులను స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు తమ దృష్టికి తీసుకువచ్చారని, కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుని ఈ రహదారిని నిర్మించిందని ఆయన చెప్పారు. అధికారుల సహకారంతో స్వల్ప కాలంలోనే పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చామని వెల్లడించారు.
గడచిన 20 నెలల్లో ఉపాధి హామీ, పంచాయతీరాజ్, ఇతర నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 22 ప్రధాన ఆలయాలకు సుమారు రూ.40 కోట్లతో రోడ్ల సౌకర్యం కల్పించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ మార్గాన్ని ఇప్పటికే అందుబాటులోకి తీసుకువచ్చామని, కోటప్పకొండలో కూడా రహదారి మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రామతీర్థంలో జరిగిన విగ్రహ ధ్వంస ఘటన భక్తుల మనసులను కలచివేసిందని, ఆ వేదనను గుర్తు చేస్తూ ఇప్పుడు ఆలయ అభివృద్ధి ద్వారా భక్తులకు సౌకర్యాలు కల్పించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు. ఆలయాల పవిత్రతను కాపాడటం, దేశ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
