మధ్యాహ్న భోజన నాణ్యత తగ్గితే కఠిన చర్యలు: లోకేష్
మధ్యాహ్న భోజన నాణ్యత తగ్గితే కఠిన చర్యలు: లోకేష్
పథకంపై నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరిక
ఉపాధ్యాయులు ముందుగా భోజనం రుచి చూడాలని ఆదేశం
పథకం పర్యవేక్షణకు సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రతిపాదన
అమరావతి, 13 మార్చి (పీపుల్స్ మోటివేషన్): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం విషయంలో రుచి, శుచి, నాణ్యత లేదా పోషక విలువలు తగ్గితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. అపర అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ పేరుతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకంపై ఎలాంటి కుట్రలు జరిగినా లేదా నిర్లక్ష్యం జరిగినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఈ అంశంపై విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆయన ఫోన్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం తారక రామానగర్ మండల పరిషత్ పాఠశాలలో భోజనం బాగాలేదని సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన విషయంపై అధికారులు మంత్రికి వివరించారు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జాన్ విద్యార్థులను తప్పుదోవ పట్టించి దుష్ప్రచారం చేసినట్లు సమాచారం అందినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి లోకేష్ ఇలాంటి కుట్రపూరిత ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని అధికారులకు సూచించారు.
పిల్లలకు అందించే భోజనం విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రతిరోజూ భోజనం సిద్ధమైన తర్వాత విద్యార్థులకు వడ్డించే ముందు ఒక ఉపాధ్యాయుడు తప్పనిసరిగా రుచి చూసి నాణ్యతను నిర్ధారించాలని తెలిపారు. పథకం అమలులో పారదర్శకత, నాణ్యత పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా సెంట్రలైజ్డ్ కిచెన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను పెంచేందుకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కూడా అవసరమని మంత్రి పేర్కొన్నారు. వారానికి ఒకరోజు స్థానిక ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని ఏదైనా పాఠశాలను సందర్శించి పిల్లలతో కలిసి భోజనం చేయాలని సూచించారు. దీంతో లోటుపాట్లను వెంటనే గుర్తించి సరిదిద్దుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. భోజనం నాణ్యతపై తల్లిదండ్రులు తమ అభిప్రాయాలు లేదా ఫిర్యాదులను ‘లీప్’ యాప్ ద్వారా తెలియజేయవచ్చని మంత్రి తెలిపారు. వ్యక్తిగత లేదా రాజకీయ ప్రయోజనాల కోసం పథకంపై తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు.
