బుల్లెట్ నుంచి బ్యాలెట్ వరకు నా జీవితం – మంత్రి సీతక్క
బుల్లెట్ నుంచి బ్యాలెట్ వరకు నా జీవితం – మంత్రి సీతక్క
- షీ స్పార్క్స్ 2026 కార్యక్రమంలో ప్రసంగం
- ప్రజాస్వామ్యం ఇచ్చిన అవకాశాలతోనే మార్పు సాధ్యమైంది
- మహిళల ఆర్థిక సాధికారతపై ప్రభుత్వ చర్యలు
న్యూఢిల్లీ, మార్చి 14 (పీపుల్స్ మోటివేషన్): బుల్లెట్ నుంచి బ్యాలెట్ వరకు తన జీవిత ప్రయాణం ప్రజాస్వామ్యం కల్పించిన అవకాశాల ఫలితమని తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ దనసరి అనసూయ తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో ముందంజలో ఉన్న మహిళా నాయకులను ఒక వేదికపైకి తీసుకువచ్చిన ‘షీ స్పార్క్స్ 2026’ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఢిల్లీలోని ఐఐటీ ప్రాంగణంలో జాతీయ మీడియా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తన జీవిత ప్రయాణం, ప్రజాసేవలోకి వచ్చిన విధానం, మంత్రిగా తీసుకున్న కీలక నిర్ణయాలపై నిర్వాహకులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజంలో మార్పు తీసుకురావడంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. వ్యాపారవేత్తలు, పరిశోధకులు, ఐటీ నిపుణులు, రచయితలు, కళాకారులు, పరిపాలనాధికారులు వంటి అనేక రంగాల్లో ప్రతిభ చూపుతున్న మహిళలను ఒకే వేదికపైకి తీసుకురావడం సంతోషకరమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మహిళల నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయడంలో సహాయపడతాయని చెప్పారు. తాను రాజకీయ కుటుంబం నుంచి రాలేదని, ములుగు జిల్లా జగ్గన్నపేట గ్రామానికి చెందిన ఆదివాసీ కుటుంబంలో జన్మించి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ప్రజాసేవలోకి వచ్చానని గుర్తుచేశారు.
ఒకప్పుడు అన్యాయం, దోపిడీకి వ్యతిరేకంగా నక్సలైట్ ఉద్యమంలో పనిచేసిన తన జీవితం తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసం పెరిగి ప్రధాన ప్రవాహంలోకి వచ్చానని మంత్రి తెలిపారు. విద్య ద్వారా జీవితాన్ని మార్చుకోవచ్చని నమ్మి న్యాయ విద్యను అభ్యసించి న్యాయవాదిగా పనిచేశానని, అనంతరం ప్రజల సేవ కోసం ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించానని చెప్పారు. ఒకప్పుడు న్యాయస్థానంలో నిందితురాలిగా నిలిచిన తాను, తర్వాత అదే కోర్టులో న్యాయవాదిగా నిలిచిన సందర్భం తన జీవితంలో పెద్ద మలుపు తీసుకువచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందని మంత్రి వివరించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం ద్వారా రాష్ట్రంలో 46 లక్షలకుపైగా మహిళలు స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడి సామాజిక, ఆర్థిక మార్పుకు దోహదపడుతున్నారని చెప్పారు. బ్యాంకు లింకేజీలు, చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలకు రుణాలు, మార్కెట్ అవకాశాలు కల్పిస్తూ మహిళలను ఉద్యోగార్ధులుగా కాకుండా ఉద్యోగ సృష్టికర్తలుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి విధానం ద్వారా మహిళలకు పెద్ద స్థాయిలో వ్యాపార అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి చెప్పారు. స్వయం సహాయక సంఘాలు బస్సులు నిర్వహించడం, కమ్యూనిటీ క్యాంటీన్లు నడపడం, వరి కొనుగోలు కేంద్రాలు నిర్వహించడం, పాఠశాల యూనిఫార్మ్‌లు తయారు చేయడం వంటి అనేక రంగాల్లో ముందంజలో ఉన్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి బజార్ ద్వారా గ్రామీణ మహిళలు తమ ఉత్పత్తులను నగర మార్కెట్‌కు నేరుగా విక్రయించే అవకాశాన్ని కల్పించామని తెలిపారు. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలు బలపడతాయని, సమాజం అభివృద్ధి చెందుతుందని మంత్రి సీతక్క అన్నారు.
