ఎల్పీజీ సంక్షోభానికి ప్రత్యామ్నాయ మార్గాలు
ఎల్పీజీ సంక్షోభానికి ప్రత్యామ్నాయ మార్గాలు
- పీఎన్జీ విస్తరణపై సీఎం దృష్టి
- ప్రతి ఇంటికి పీఎన్జీ కనెక్షన్ లక్ష్యంగా కార్యాచరణ
- ఇండక్షన్, ఎలక్ట్రిక్ వంట పరికరాల వినియోగానికి ప్రోత్సాహం
- పంట నష్టం, టెక్నాలజీ వినియోగంపై సమీక్ష
అమరావతి, మార్చి 23 (పీపుల్స్ మోటివేషన్): రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో నెలకొన్న సమస్యలను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి ఇంటికీ పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్ అందించేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్పీజీ సరఫరా, అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టం, టెక్నాలజీ వినియోగం వంటి అంశాలపై ఆయన క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. గ్యాస్ సంక్షోభాన్ని విద్యుత్ రంగానికి ఒక అవకాశంగా మలచాలని సీఎం సూచించారు. ఇండక్షన్ స్టవ్‌లు, ఎలక్ట్రిక్ కుక్కర్ల వినియోగాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రోత్సహించాలని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే 2.34 లక్షల పీఎన్జీ కనెక్షన్లు అందుబాటులో ఉన్నప్పటికీ కేవలం 60 వేల మంది మాత్రమే వినియోగిస్తున్నారని అధికారులు వివరించగా, దీనిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలో కనీసం 10 వేల కొత్త పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యాన్ని నిర్దేశించారు.
శ్రీకాకుళం–కాకినాడ పైప్‌లైన్ పనులు నిలిచిపోవడంపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టును పునరుద్ధరించేందుకు కేంద్ర మంత్రికి తక్షణమే లేఖ రాయాలని అధికారులకు సూచించారు. ఏపీ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌కు అవసరమైన ఉత్తర్వులు వెంటనే జారీ చేయాలని ఆదేశించారు. వాణిజ్య రంగంలో సహజ వాయువు వినియోగాన్ని పెంచేందుకు ‘నేచురల్ గ్యాస్ పాలసీ’ని వచ్చే కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టాలని తెలిపారు. అత్యవసర రంగాలకు గ్యాస్ సరఫరాపై కూడా సీఎం దృష్టి సారించారు. విద్యా సంస్థలు, ఆస్పత్రులు, అంగన్‌వాడీలు, అన్న క్యాంటీన్లు, హోటళ్లకు ప్రాధాన్యత క్రమంలో ఎల్పీజీ సిలిండర్లను సరఫరా చేయాలని సూచించారు. ప్రస్తుతం రోజుకు సగటున 1.80 లక్షల సిలిండర్లు పంపిణీ జరుగుతున్నాయని, మరో 14,444 మెట్రిక్ టన్నుల గ్యాస్ నిల్వలు ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. అకాల వర్షాల కారణంగా జరిగిన పంట నష్టంపై పూర్తి స్థాయి నివేదికను ఈ నెల 26లోగా సమర్పించాలని సీఎం ఆదేశించారు. వ్యవసాయ రంగంలో జీఎస్‌డీపీ, ఉత్పాదన పెరిగిన నేపథ్యంలో పంటల నిర్వహణ, పంటల మార్పిడి విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రైతులకు నష్టం తక్కువయ్యేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. పాలనలో టెక్నాలజీ వినియోగంపై సీఎం ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో తిరుమలలో దర్శనాల నిర్వహణ మెరుగుపడిన ఉదాహరణను ప్రస్తావించారు. క్యూలైన్ల నిర్వహణలో మెరుగుదలతో భక్తుల నిరీక్షణ సమయం తగ్గి, అదనంగా 20 శాతం దర్శనాలు సాధ్యమయ్యాయని తెలిపారు. ఇదే తరహాలో ఇతర శాఖలు కూడా ఏఐ వినియోగాన్ని పెంచాలని సూచించారు.
ఐఓటీ పరికరాలు, సెన్సార్లు, సీసీటీవీల ద్వారా వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంతో సాగు వ్యయం తగ్గించి, ఉత్పత్తి పెంచే అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో బ్యాండ్‌విడ్త్ పెంచి, డేటాను సమర్థంగా ఉపయోగించి ఉత్తమ ఫలితాలు సాధించాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
