శ్రీకాకుళంలో గిరిజన బాలిక అనుమానాస్పద మృతి
శ్రీకాకుళంలో గిరిజన బాలిక అనుమానాస్పద మృతి
- అత్యాచారం, హత్య అనుమానాలు
- సివిల్ ఇంజినీర్‌పై ఆరోపణలు
- “చదువు చెబుతాను” అంటూ నమ్మించి తీసుకెళ్లిన నిందితుడు
- పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్న పోలీసులు
శ్రీకాకుళం, మార్చి 26 (పీపుల్స్ మోటివేషన్): ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో గిరిజన బాలిక అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని మృతిపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. వివరాల్లోకి వెళితే, పరీక్షలు ముగించుకుని ఇంటికి వచ్చిన బాలికను సివిల్ ఇంజినీర్ వెంకటేశ్వరరావు “చదువు చెబుతాను” అంటూ నమ్మించి తీసుకెళ్లినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 23న బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లినట్లు సమాచారం. అక్కడే పలుమార్లు అత్యాచారం చేసి దాడి చేసినట్టు అనుమానిస్తున్నారు. 24న బాలిక అనారోగ్యంగా ఉందని నిందితుడు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం “మీ కుమార్తె చనిపోయింది… నేనే కారణం” అంటూ తల్లిదండ్రులకు చెప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం బయటకు చెప్పొద్దని డబ్బు ఇస్తానని ఒత్తిడి చేసినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
బాలిక ఒంటిపై గాయాలు గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునే సరికి బాలిక మరణించి 24 గంటలకు పైగా అయి ఉండవచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. ఈ విషయంతో ఘటనపై అనుమానాలు మరింత పెరిగాయి. ఈ ఘటనపై హిరమండలం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితుడిని అదుపులోకి తీసుకునే దిశగా చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పోస్టుమార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. నివేదిక వచ్చిన తరువాతే మృతి అసలు కారణం బయటపడనుంది. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
