ఇండక్షన్ స్టవ్ వాడితే కరెంట్ బిల్ ఎంత పెరుగుతుంది?
ఇండక్షన్ స్టవ్ వాడితే కరెంట్ బిల్ ఎంత పెరుగుతుంది?
హైదరాబాద్, మార్చి 15 (పీపుల్స్ మోటివేషన్):
వంట గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో చాలా మంది కుటుంబాలు వంట కోసం ఇండక్షన్ స్టవ్‌లను ఉపయోగించడం ప్రారంభించాయి. అయితే ఇండక్షన్ స్టవ్ వాడితే కరెంట్ బిల్లు ఎంత పెరుగుతుందో అనేది చాలామందికి సందేహంగా ఉంది. నిపుణుల అంచనా ప్రకారం 1200 వాట్ల నుంచి 2200 వాట్ల సామర్థ్యం గల ఇండక్షన్ స్టవ్‌ను ఒక గంట పాటు ఉపయోగిస్తే సుమారు 1.5 నుంచి 2 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగం జరుగుతుంది.
దీని ప్రకారం రోజూ కొంతసేపు వాడితే నెలకు సుమారు 60 యూనిట్ల అదనపు విద్యుత్ వినియోగం ఉండొచ్చు. ఒక యూనిట్ విద్యుత్ ధర సగటున ₹5 నుంచి ₹6 మధ్య ఉంటే నెలవారీ కరెంట్ బిల్లు సుమారు ₹500 నుంచి ₹800 వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ అదనపు ఖర్చును తగ్గించుకోవచ్చు. అవసరానికి అనుగుణంగా పవర్ సెట్టింగ్ పెట్టుకోవడం, వంట పూర్తయ్యాక వెంటనే స్టవ్ ఆఫ్ చేయడం, సరైన మెటల్ బేస్ ఉన్న పాత్రలను ఉపయోగించడం వల్ల విద్యుత్ వినియోగం తగ్గుతుంది.
ఇండక్షన్ స్టవ్ వాడేటప్పుడు భద్రతా జాగ్రత్తలు కూడా తప్పనిసరిగా పాటించాలి. స్టవ్‌పై నీరు లేదా ఇతర ద్రవాలు పడకుండా చూసుకోవాలి. శుభ్రం చేసే సమయంలో పొడి బట్టను మాత్రమే ఉపయోగించాలి. స్టవ్‌ను మన్నికైన స్విచ్ బోర్డుకు మాత్రమే కనెక్ట్ చేయాలి. వంట పూర్తయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్‌ను తీసివేయడం మంచిది. అలాగే స్టవ్ దగ్గర ప్లాస్టిక్ వస్తువులు లేదా బట్టలు ఉంచకుండా జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చు.
