లైసెన్స్డ్ సర్వేయర్ల సమస్యలపై హరీశ్ రావు ఆగ్రహం
లైసెన్స్డ్ సర్వేయర్ల సమస్యలపై హరీశ్ రావు ఆగ్రహం
ఎకరానికి పది రూపాయల కమిషన్‌పై తీవ్ర విమర్శలు
సర్వేయర్లకు బీఆర్ఎస్ అండగా ఉంటామని హామీ
సిద్దిపేట, మార్చి 1 (పీపుల్స్ మోటివేషన్): లైసెన్స్డ్ సర్వేయర్ల సమస్యలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. ప్రైవేట్, ఐటీ ఉద్యోగాలు వదిలి సర్వేయర్లుగా చేరిన ఆరు వేల ఐదు వందల మంది యువతను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాటలు నమ్మి ఉద్యోగాలు వదిలేసుకున్న వారిని ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. మంచి జీతం ఇస్తామని చెప్పి శిక్షణ ఇచ్చి ప్రమాణ స్వీకారాలు చేయించిన తరువాత ఎకరానికి కేవలం పది రూపాయల కమిషన్ ఇస్తామనడం విద్యావంతులైన యువతను అవమానించడమేనని హరీశ్ రావు అన్నారు. ఏడాది పొడవునా రెండు వేల ఎకరాలు సర్వే చేసినా వారికి వచ్చే మొత్తం ఇరవై వేల రూపాయలేనని పేర్కొన్నారు
ఏడాదిగా జీతాలు లేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మండల కార్యాలయాల్లో ఉచితంగా పనులు చేయించుకుంటూ శ్రమదోపిడీ చేస్తున్నారని విమర్శించారు. తనను కలిసిన సర్వేయర్లకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం తక్షణమే సర్వేయర్లకు గౌరవ వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సర్వేయర్ల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామని, న్యాయం జరిగే వరకు పోరాడతామని హరీశ్ రావు స్పష్టం చేశారు.
