ఇంటర్ లో ‘ఎంజేపీ’ సత్తా
ఇంటర్ లో ‘ఎంజేపీ’ సత్తా
- జూనియర్ ఇంటర్ లో 97 శాతం
- సీనియర్ ఇంటర్ లో 94 శాతంతో బీసీ విద్యార్థుల ఉత్తీర్ణత
- జూనియర్ బైబీసీలో మొదటి, రెండు ర్యాంకులు బీసీ బిడ్డలవే
- జూనియర్ సీఈసీలోనూ ఫస్ట్ ర్యాంకు సొంతం
- ఏడు గురుకులాల్లో సీనియర్ ఇంటర్ లో వంద శాతం ఫలితాలు
- మూడు గురుకులాల్లో జూనియర్ ఇంటర్ లో నూరు శాతం ఉత్తీర్ణత
- రాష్ట్ర స్థాయి ఫలితాల కంటే ఎంజేపీ ఫలితాలే టాప్
- ప్రభుత్వ పరిధిలో సంస్థల్లో ఎంజేపీదే హవా...
- జూనియర్ లో ఫస్ట్ ప్లేస్ ... సీనియర్లలో సెకండ్ ప్లేస్
- ఇంటర్ ఫలితాల్లో ఎంజేపీ విజయభేరిపై మంత్రి సవిత హర్షం
- సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లక్ష్యం నెరవేర్చిన బీసీ బిడ్డలు
- విద్యార్థులకు, ఉపాధ్యాయ సిబ్బందికి మంత్రి సవిత అభినందనలు
అమరావతి : ఇంటర్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇంటర్ లో 97 శాతం, సెకండ్ ఇంటర్ లో 94 శాతంతో బీసీ బిడ్డలు ఉత్తీర్ణులయ్యారు. జూనియర్ బైపీసీ, ఎంపీసీలో స్టేట్ మొదటి రెండు ర్యాంకులు, సీఈసీలో స్టేట్ ఫస్గ్ ర్యాంకు ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులు సాధించడం విశేషం. జూనియర్ ఇంటర్ లో మూడు ఎంజేపీ గురుకులాలు నూటికి నూరు శాతం ఫలితాలు సాధించగా, సీనియర్ ఇంటర్ లో ఏడు గురుకులాల వంద శాతం మేర ఫలితాలు సాధించాయి. వాటిలో మూడు గురుకులాలు సీనియన్, జూనియర్ ఇంటర్ లో వంద శాతం ఫలితాలు రాబట్టాయి. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అన్ని రకాల విద్యా సంస్థల్లో ఇంటర్ ఫలితాల్లో జూనియర్ ఇంటర్ లో ఎంజేపీ గురుకుల విద్యార్థులు 97 శాతంతో మొదటి వరుసలో నిలిచారు. సీనియర్ ఇంటర్ లో 94 శాతంతో రెండో స్థానంలో నిలిచి ఔరా అనిపించుకున్నారు. రాష్ట్ర స్థాయి ఫలితాల కంటే ఎంజేపీ గురుకుల విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం అధికం ఉండడం విశేషం. ఇంటర్మీడియట్ ఫలితాలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం విడుదల చేశారు. జూనియర్ ఇంటర్ లో 77 శాతం, సీనియర్ ఇంటర్ లో 81 మంది శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు నెల రోజులు పాటు కొనసాగి, మార్చి 24వ తేదీతో ముగిశాయి. జూనియర్ ఇంటర్ పరీక్షలకు 5,10,307 మంది, సీనియర్ ఇంటర్ కు 5,05,609 మంది మొత్తం 10,15,916 మంది హాజరయ్యారు.
జూనియర్ బైపీసీలో 1, 2 స్టేట్ ర్యాంకులు ఎంజేపీవే...
జూనియర్ ఇంటర్ లో ఎంజేపీ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. ఫస్ట్ ఇంటర్ లో 97 శాతంతో బీసీ గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. 18 గురుకుల కళాశాలలకు చెందిన మొదటి సంవత్సరం పరీక్షలకు 1,728 మంది హాజరుకాగా, 1,663 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలతో పాటు మూడు గ్రూపుల్లోనూ స్టేట్ ర్యాంకులు సాధించి ఎంజేపీ విద్యార్థినులు విజయ ఢంకా మోగించారు. బైపీసీలో అరికెలకు చెందిన సీహెచ్.శ్రీలక్ష్మి తేజస్విని 455 మార్కులకు 453 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించింది. సీఈసీ గ్రూప్ లో అరికెలకు చెందిన పి.సురేఖ 500 మార్కులకు 496 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ గా నిలిచింది. ఎంపీసీలో 470 మార్కులకు 467 మార్కులు సాధించిన ధర్మాన అనురాధ(నెల్లిమర్ల) స్టేట్ లో ద్వితీయ స్థానంలో నిలిచింది.
సీనియర్ ఇంటర్ లో 94 శాతం
సీనియర్ ఇంటర్ లోనూ ఎంజేపీ గురుకుల విద్యార్థులు ప్రతిభ చాటారు. 1,849 మంది విద్యార్థులు ద్వితీయ ఇంటర్ పరీక్షలు రాయగా, వారిలో 1,735 మంది ఉత్తీర్ణత సాధించారు. 94 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే విద్యా సంస్థల్లో ఎంజేపీ విద్యార్థులు రెండో స్థానంలో నిలిచారు. నెల్లిమర్లకు ఎంజేపీ గురుకులానికి చెందిన జి.ప్రియాంక ఎంపీసీలో 1000 మార్కులకు 992 మార్కులు సాధించింది. బైబీసీలో డోన్ కు చెందిన బి.శైలజ 987 మార్కులు, సీఈసీలో టేకులోడుకు చెందిన ఎం.హిమబిందు 975 మార్కులు, ఎంఈసీలో టేకులోడుకు చెందిన దీప్తి 969 మార్కులు సాధించింది.
నూటికి నూరు... 3 గురుకులాలు
మూడు ఎంజేపీ గురుకులాలు జూనియర్, సీనియర్ ఇంటర్ లో నూటికి నూరు ఫలితాలు సాధించాయి. సీనియర్, జూనియర్ ఇంటర్ పరీక్షలకు హాజరైన ఆముదాలవలస, ఆరికెల, నెరవాడ గురుకులాలకు చెందిన విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించడం విశేషం. ఇవే కాకుండా గుదిబండ, మోపిదేవి, నందలూరు, సోదాం కు చెందిన గురుకులాల విద్యార్థులు సీనియర్ ఇంటర్ లో వందకు వందశాతం ఫలితాలు రాబట్టారు.
రాష్ట్ర స్థాయి కంటే ఎంజేపీ సత్తా
రాష్ట్ర స్థాయి పలితాల కంటే ఎంజేపీ గురుకులాల ఉత్తీర్ణతా శాతం అధికంగా ఉంది. జూనియర్ ఇంటర్ లో రాష్ట్ర స్థాయి ఫలితాలు 77 శాతం రాగా, ఎంజేపీలో 97 శాతం మేర రావడం గమనార్హం. సీనియర్ ఇంటర్ లో రాష్ట్రస్థాయి ఫలితాలు 81 శాతం రాగా, ఎంజేపీ విద్యార్థులు 94 శాతంతో సత్తా చాటారు. ప్రభుత్వ పరిధిలో నడిచే అన్ని విద్యా సంస్థల కంటే ఎంజేపీ గురుకులాలు జూనియర్ ఇంటర్ లో ప్రథమ స్థానంలో నిలిచాయి. సీనియర్ ఇంటర్ లో రెండో స్థానం సాధించాయి. జూనియర్ ఇంటర్ లో గతేడాది 92 శాతం రాగా, ఈ ఏడాది ఏకంగా 97 శాతం మేర ఫలితాలు రావడం విశేషం. సీనియర్ ఇంటర్ లో గతేడాది 97 శాతం రాగా, ఈ ఏడాది 94 శాతం ఫలితాలు వచ్చాయి.
చంద్రబాబు, లోకేశ్ లక్ష్యం నెరవేరింది... : మంత్రి సవిత
ఇంటర్ ఫలితాల్లో ఎంజేపీ గురుకుల విద్యార్థులు సత్తా చాటడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తంచేశారు. ఫస్ట్ ఇంటర్ లో 97 శాతం, సెకండ్ ఇంటర్ లో 94 శాతం ఫలితాలు సాధించినందుకు విద్యార్థులకు, ఉపాధ్యాయ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి 90 శాతానికి పైగా ఫలితాలు సాధిస్తూ, బీసీ బిడ్డలు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లక్ష్యాన్ని నెరవేర్చారన్నారు. బీసీ బిడ్డలు అత్యున్నత స్థానాల్లో నిలవాలన్నది సీఎం చంద్రబాబు సంకల్పమన్నారు. విద్యతోనే సాధ్యమని నమ్మి, ఎంజేపీ, బీసీ హాస్టళ్ల అభివృద్ధికి రెండేళ్లలో పెద్దఎత్తున నిధులు కేటాయించారన్నారు. బీసీ బిడ్డలకు నాణ్యమైన భోజనం అందించాలన్న ఉద్దేశంతో సన్న బియ్యం అందజేస్తున్నారన్నారు. నాణ్యమైన ఆహారం, ఆరోగ్య రక్షణతో కూడిన విద్యను బీసీ బిడ్డలకు అందిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో బీసీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని కొనియాడారు. రాబోయే పదో తరగతి ఫలితాల్లోనూ ఇదే మాదిరిగా ఉత్తీర్ణత సాధిస్తామని మంత్రి సవిత ధీమా వ్యక్తంచేశారు.

