రాజ్యసభలో అమరావతి బిల్లుపై ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గర్జన
రాజ్యసభలో అమరావతి బిల్లుపై ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గర్జన
అమరావతిని తామెప్పుడూ వ్యతిరేకించలేదన్న వైవీ సుబ్బారెడ్డి
రాజధానిపై కేంద్రం తన అఫిడవిట్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తోందని విమర్శ
నిరసనగా రాజ్యసభ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాకౌట్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2 (పీపుల్స్ మోటివేషన్): రాజ్యసభలో గురువారం ప్రవేశపెట్టిన అమరావతి రాజధాని బిల్లుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమ పార్టీ గానీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గానీ ఏనాడూ అమరావతిని వ్యతిరేకించలేదని ఆయన సభలో స్పష్టం చేశారు. రాజధాని నిర్ణయం అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని కేంద్ర ప్రభుత్వమే గతంలో కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని ఆయన గుర్తు చేశారు. అలాంటప్పుడు ఇప్పుడు కేంద్రం ఏ ప్రాతిపదికన రాజధానిపై బిల్లును ప్రవేశపెడుతుందని ఆయన నిలదీశారు. ఈ పరిణామం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన మండిపడ్డారు.
రాజధాని నిర్మాణం పేరుతో జరుగుతున్న ఖర్చుపై వైవీ సుబ్బారెడ్డి గణంకాలతో సహా విమర్శలు గుప్పించారు. అమరావతి కోసం ఇప్పటికే 50,000 ఎకరాల భూమిని తీసుకున్నారని, కానీ అక్కడ శాశ్వత నిర్మాణాలు ఏవీ జరగలేదని ఆయన ఆరోపించారు. ఒక్కో ఎకరా అభివృద్ధికి రెండు కోట్ల రూపాయల చొప్పున 50,000 ఎకరాలకు సుమారు లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చవుతుందని ప్రభుత్వం చెబుతోందని ఆయన విశ్లేషించారు. సరిపోదన్నట్లుగా మరో 50,000 ఎకరాలు సేకరిస్తామని అనడం విడ్డూరంగా ఉందని, ఇంత భారీ మొత్తంలో నిధులు ఎక్కడి నుండి వస్తాయని ఆయన ప్రశ్నించారు. అమరావతి విషయంలో రాజ్యాంగబద్ధమైన ప్రక్రియను పాటించలేదని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. శాసనమండలిలో సరైన చర్చ జరపకుండానే అమరావతి తీర్మానం చేశారని, ఇది శాసన ప్రక్రియను అవహేళన చేయడమేనని ఆయన దుయ్యబట్టారు. అమరావతి పేరుతో గత పాలకుల నుంచి ప్రస్తుత పాలకుల వరకు ఒక పెద్ద డ్రామా నడుపుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో అభివృద్ధి కంటే ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, రాజధాని ప్రాంత రైతుల ప్రయోజనాలను విస్మరించి రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర విభజన చట్టం మరియు కేంద్రం గతంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, ఏకపక్షంగా బిల్లును తీసుకురావడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. రాజధాని అంశంపై స్పష్టత లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రగతి కుంటుపడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఒక ప్రాంతం అభివృద్ధిపైనే లక్షల కోట్లు వెచ్చించడం వల్ల వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందని ఆయన తన ప్రసంగంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లు రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టులాంటిదని ఆయన అభివర్ణించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమరావతి బిల్లుకు నిరసనగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా చర్చలు జరపకుండా, రాష్ట్రాల హక్కులను కాలరాసేలా ఉన్న ఈ బిల్లును తాము ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదించబోమని వారు స్పష్టం చేశారు. సభ వెలుపల మీడియాతో మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డి, తమ పోరాటం పార్లమెంటుతో ఆగిపోదని, ప్రజల పక్షాన న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. ఈ వాకౌట్‌తో రాజ్యసభలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.
