రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

సూర్యప్రభవాహనంపై శ్రీ మన్నారాయణుడి అభయం

RATHA SAPTAMI, MAGHA SAPTAMI, TTD, TIRUMALA RATHA SAPTAMI, RATHA SAPTAMI TTD, TIRUPATI NEWS, DEVOTIONAL NEWS
Peoples Motivation

సూర్యప్రభవాహనంపై శ్రీ మన్నారాయణుడి అభయం

- తిరుమలలో వైభవంగా రథసప్తమి


తిరుపతి/ తిరుమల, ఫిబ్రవరి 16 (పీపుల్స్ మోటివేషన్):-

సూర్య జయంతిని పురస్కరించుకుని శుక్రవారంనాడు తిరుమలలో 'రథసప్తమి' ఉత్సవాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది. ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఒకే రోజున శ్రీమలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడం విశేషం. ఈ కారణంగా ఈ ఉత్సవాన్ని అర్ధ బ్రహ్మోత్సవం, మినీ బ్రహ్మోత్సవం, ఒకరోజు బ్రహ్మోత్సవంగా పిలుస్తుంటారు.

      రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో క్రీ.శ 1564 నుండి జరుపుతున్నట్లుగా శాసనాధారాలు ఉన్నాయి. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై స్వామివారిని వేంచేపు చేస్తారు.  

TTD TIRUPATI

సూర్యప్రభ వాహనం - (ఉదయం 5.30 నుండి 8 గంటల వరకు) :

అత్యంత ప్రధానమైన రథసప్తమి వాహనసేవ సూర్యప్రభవాహనం. సర్వలోకాలకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయించే శ్రీ సూర్య భగవానుడు తన ఉషారేఖలను ఉదయం శ్రీవారి పాదాలపై ప్రసరించి అంజలి ఘటించాడు. ఈ వాహనసేవ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు ఉదయాత్పూర్వం నుండి ఎంతో ఆసక్తితో నిరీక్షిస్తున్న వేలాది మంది భక్తిపారవశ్యంతో పులకించారు. భక్తుల గోవిందనామస్మరణ మధ్య స్వామివారి వాహనసేవ వైభవంగా జరిగింది. 


ఆయురారోగ్య‌ప్రాప్తి :

సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాడు. 

ఈ వాహ‌నంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ. సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యుని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

TTD

ఆకట్టుకున్న బాలమందిరం విద్యార్థుల  'ఆదిత్యహృదయం',  'సూర్యాష్టకం' :

           రథసప్తమి పర్వదినం సందర్భంగా సూర్యప్రభ వాహనసేవలో టీటీడీ శ్రీ వేంకటేశ్వర బాలమందిరంలో చ‌దుకుంటున్న వంద మందికి పైగా విద్యార్థులు ఆలపించిన 'ఆదిత్యహృదయం', 'సూర్యాష్టకం' సంస్కృత‌ శ్లోకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్తర మాడ వీధిలోకి సూర్యప్రభ వాహనం వచ్చిన అనంతరం విద్యార్థులు లయబద్ధంగా శ్లోకాలు ఆలపించారు. కొన్నేళ్లుగా బాలమందిరం విద్యార్థులు శ్లోకాలు ఆల‌పిస్తున్నారు. గతంలో జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాల్లోనూ విద్యార్థులు శ్రీనివాసగద్యం త‌దిత‌ర సంస్కృత శ్లోకాలు ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు.

      టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి, ఈవో ఏవి.ధర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిషోర్, ఎస్పీ మలికా గార్గ్ ఇతర అధికారులు వాహన సేవలో పాల్గొన్నారు.

Comments

-Advertisement-