నంద్యాల టీడీపీ ఎంపీ బరిలో బైరెడ్డి శబరి...
నంద్యాల టీడీపీ ఎంపీ బరిలో బైరెడ్డి శబరి...
నేడు బిజెపీ అత్యవసర సమావేశం..
కర్నూలు/ నంద్యాల, మార్చి 04 (పీపుల్స్ మోటివేషన్):-
నంద్యాల జిల్లాలో బిజెపికి బిగ్ షాక్ తగలనుందా..అవుననే అంటున్నారు విశ్లేషకులు. నంద్యాల జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షురాలు బైరెడ్డి శబరి పార్టీ వీడనున్నారని ముమ్మరంగా ప్రచారం సాగుతోంది... మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని నంద్యాల టీడీపీ ఎంపీ టికెట్ కుమార్తె బైరెడ్డి శబరి రెడ్డికి ఇచ్చేందుకు తెదేపా నాయకులు సుముఖత వ్యక్తం అయినట్లు సోమవారం పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఈ నెల 6వ తేదీన నంద్యాలకు చంద్రబాబు నాయుడు రానున్నారు. ఆ సమయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని టీడీపీకి చెందిన కొందరు కీలక నాయకులు పేర్కొన్నట్లు సమాచారం. దీంతో ఆమె అనుచరులు, అభిమానులు సోమవారం రాత్రి నగరంలోని పలు కూడలల్లో పెద్దఎత్తున బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి పెట్టారు. బైరెడ్డి రాజశేఖరరెడ్డికి అనుకూలంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనను అంతం చేయాలన్నది తన లక్ష్యమని.. అందుకనుగుణంగానే తన నిర్ణయాలుంటాయని బైరెడ్డి గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయనకు పాణ్యం టికెట్ ఇవ్వాలంటూ తెదేపాను కోరుతూ ఆయన అభిమానులు ఇటీవల పలు ప్లెక్సీలు సైతం వెలిశాయి. ప్రస్తుతం బిజెపిలో ఉన్న ఆయన కుమార్తె బైరెడ్డి శబరి సైతం తెదేపాలో చేరనున్నారంటూ గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆమెకు నంద్యాల ఎంపీ టికెట్ ఇచ్చేందుకు టీడీపీ పెద్దలు సుముఖత చూపడంతో ఆమె టీడీపీలో చేరనున్నారని వారి అభిమానులు చెబుతున్నారు. ఇప్పటికే నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ కన్వీనర్ కిషోర్ రెడ్డి వైసీపీలో చేరిన విషయం తెలిసింది. ఇది ఇలా ఉండగా ఈరోజు నంద్యాల జిల్లా బిజెపి పార్టీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లు అంతర్గత సమాచారం.