AP TET: మళ్లీ టెట్ నోటిఫికేషన్..!
AP TET: మళ్లీ టెట్ నోటిఫికేషన్..!
గత ఫిబ్రవరిలో టెట్ నిర్వహణ
ఉత్తీర్ణత సాధించిన 1,37,904 మంది అభ్యర్థులు
మరోసారి టెట్ నిర్వహిస్తామన్న మంత్రి లోకేశ్
ఫలితాల అనంతరం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందని వెల్లడి
అమరావతి (పీపుల్స్ మోటివేషన్):-
గత ఫిబ్రవరిలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024కు సంబంధించి నేడు ఫలితాలు విడుదల చేశారు. టెట్-2024లో 58.4 శాతం అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. 1,37,904 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ టెట్ లో అర్హత సాధించని వారికి కూటమి ప్రభుత్వం మరోసారి టెట్ నిర్వహించనుంది. కొత్తగా బీఎడ్, డీఎడ్ పూర్తిచేసుకున్న వారికి కొత్త టెట్ లో అవకాశం కల్పించనున్నారు.
టెట్ ఫలితాల విడుదల అనంతరం, మంత్రి నారా లోకేశ్ స్పందించారు. టెట్ లో అర్హత సాధించినవారికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక మెగా డీఎస్సీకి అందరూ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.
టెట్ ఫలితాల కోసం 2.35 లక్షల మంది ఎదురుచూశారని వెల్లడించారు. డీఎస్సీలో టెట్ అర్హతకు 20 శాతం వెయిటేజి ఉండడంతో అందరూ ఆత్రుతగా ఎదురుచూశారని వివరించారు. ఇప్పుడు అర్హత సాధించని వారికి మరోసారి టెట్ నిర్వహిస్తామని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. టెట్ ఫలితాల తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందని తెలిపారు.