రామోజీరావు: ఆయన మాట్లాడుతుంటే పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరమో అర్థమైంది..!
Ramojirao: ఆయన మాట్లాడుతుంటే పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరమో అర్థమైంది..!
నేడు ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ సభ
హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
రామోజీరావు నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తి అని కితాబు
జీవితంలో ఎప్పుడూ రాజీపడొద్దని చెప్పారని వెల్లడి
జీవితంలో ఎప్పుడూ రాజీపడొద్దని చెప్పారని వెల్లడి
ఈనాడు గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు రామోజీరావు సంస్మరణ సభకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ... రామోజీరావు గురించి అందరూ చెప్పిన దాని కంటే, తన అనుభవంలో రామోజీరావు గురించి ఎంతో తెలుసుకున్నానని వెల్లడించారు. రామోజీరావు సినీ రంగంలో ఉన్నప్పటికీ ఆయనతో తనకు పరిచయం లేదని తెలిపారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలినాళ్లలో 2008లో మొదటిసారిగా రామోజీరావును కలిశానని వెల్లడించారు.
"రామోజీరావు మాట్లాడే విధానం చాలా నిక్కచ్చిగా ఉండేది. ఆయన ప్రజల పక్షపాతి అని అర్థమైంది. ఆయన మాట్లాడుతున్నంత సేపూ నా మదిలో ఒకటే ఆలోచన... పాత్రికేయ విలువలను కాపాడడానికే ఆయన ఉన్నారు అని అర్థమైంది. ఆయన నాతో మాట్లాడినంత సేపూ ప్రజా సంక్షేమం కోణంలోనే చర్చ జరిగింది.
2019లో ఒకసారి లంచ్ కు ఆహ్వానించారు. ఆ సందర్భంగా దేశ పరిస్థితులు, పత్రికా స్వేచ్ఛ గురించి, తాను ఎప్పుడూ రాజీ పడకపోవడం గురించి చెప్పారు. అంతేకాదు... తనకు పరిచయస్థులు కానీ, సన్నిహితులు కానీ, ఇంకెవరి పట్ల అయినా గానీ... ప్రజా ప్రయోజనాల కోణం నుంచి చూస్తే ఆయన వైఖరి చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటుంది. లంచ్ తర్వాత ఆయనతో మాట్లాడుతుంటే, పత్రికా స్వేచ్ఛ అనేది ఈ దేశానికి ఎంత అవసరమో అర్థమైంది.
ఒక వ్యక్తిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనకందరికీ తెలుసు. దినపత్రిక నడపడం ఎంతో కష్టమైన పని. తాను నమ్మిన విలువలు పాటిస్తూ పత్రిక నడిపే వ్యక్తి ఇతర వ్యాపారాలు చేస్తుంటే, అతడిపై దాడులు చేయడం సులువు. కానీ అలాంటి దాడులను కూడా ఎదుర్కొని ముందుకు సాగిన వ్యక్తి రామోజీరావు. ఆయనను కలిసిన సమయంలో ఒక్కటే చెప్పారు... నువ్వు పైకొస్తున్న రాజకీయ నాయకుడివి. నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను... జీవితంలో ఎప్పుడూ రాజీపడొద్దు... నువ్వు ఏదైతే నమ్ముతావో దాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించు అని చెప్పారు. ఆయన మాటలు ఇప్పటికీ నేను మర్చిపోలేదు.
ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఆయన సంస్మరణ కార్యక్రమంలో భాగం కావడం ఎంతో ఆనందంగా ఉంది. ఓ దశలో ఆయన కుటుంబ సభ్యులను కూడా ఇబ్బందిపెట్టారు... ఎంతయినా నలిగిపోతాను కానీ ఓ జర్నలిస్టుగా రాజీపడను అని పోరాడిన వ్యక్తి రామోజీరావు. అలా పోరాడాలంటే ఎంతో సాహసం ఉండాలి.
ఇటీవల ఎన్నికల ఫలితాలు వచ్చే ముందే ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. కానీ, మా విజయ వార్త ఆయన వినాలి అని గట్టిగా కోరుకున్నాను. శైలజా కిరణ్ గారిని కూడా అడిగాను... ఆయనకు సరిగ్గా వినిపించడంలేదంటున్నారు కదా... మా విజయ వార్త విన్నారా? అని అడిగి తెలుసుకున్నాను.
దశాబ్దకాలం పాటు నలిగిపోయిన వ్యక్తి ఆ విజయ వార్త వినకపోతే ఆయన ఆత్మ క్షోభిస్తుందేమో అనిపించింది. కానీ విజయ వార్త వినే ఆయన కన్నుమూశారు. ఆ విషయం నాకు తృప్తినిచ్చింది. అటువంటి మహానుభావుడికి నా నివాళులు అర్పిస్తున్నాను" అంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.