షాకింగ్ న్యూస్.. అంత్యక్రియలు జరిగిన కొద్ది రోజుల తర్వాత ఇంటికి తిరిగొచ్చిన వ్యక్తి..!
షాకింగ్ న్యూస్.. అంత్యక్రియలు జరిగిన కొద్ది రోజుల తర్వాత ఇంటికి తిరిగొచ్చిన వ్యక్తి..!
మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లా ఘటన
రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని గుర్తించి అంత్యక్రియలు నిర్వహించిన కుటుంబ సభ్యులు
అంత్యక్రియలు జరిగిన 13 రోజుల తర్వాత తన ఫ్యామిలీకి ఫోన్ చేసిన వ్యక్తి
వీడియో కాల్ ద్వారా అతడు బతికే ఉన్నాడని తెలుసుకుని కుటుంబీకులు షాక్
మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని గుర్తించిన కుటుంబం సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, అంత్యక్రియలు జరిగి 13 రోజులు గడిచిన తర్వాత ఆ వ్యక్తి తన ఫ్యామిలీకి ఫోన్ చేశాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. అతడు బతికే ఉన్నాడని తెలుసుకున్న కుటుంబీకులు షాక్ అయ్యారు. మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
వివరాల్లోకి వెళితే.. షియోపూర్ జిల్లా లహచోరా గ్రామానికి చెందిన సురేంద్ర శర్మ.. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని బట్టల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. కాగా, రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ సమీపంలోని సుర్వాల్‌లో గత నెలలో రోడ్డు ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని గుర్తించాలని కోరుతూ సామాజిక కార్యకర్త ఒక ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వ్యక్తిని సురేంద్రగా అతడి కుటుంబ సభ్యులు గుర్తించారు.
జైపూర్‌లోని ఆసుపత్రికి వారు తరలించగా చికిత్స పొందుతూ అతడు చనిపోయాడు. దీంతో రాజస్థాన్ పోలీసులు పోస్ట్‌మార్టం తర్వాత మృతదేహాన్ని సురేంద్ర ఫ్యామిలీకి అప్పగించారు. దాంతో మే 28వ తేదీన అంత్యక్రియలు నిర్వహించారు. మరోవైపు 13వ రోజున సురేంద్రకు దశ దిన కర్మలు చేసేందుకు అతడి ఫ్యామిలీ సిద్ధమైంది. అయితే, ముందు రోజు సురేంద్ర నుంచి వారికి ఫోన్ వచ్చింది. నమ్మని సోదరుడు వీడియో కాల్ చేయాలని చెప్పాడు. అతడు వీడియో కాల్ చేయగా సురేంద్ర బతికే ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలుసుకుని షాక్ అయ్యారు.
వెంటనే ఇంటికి తిరిగి రావాలని చెప్పారు. అలాగే 13 రోజున నిర్వహించాల్సిన కర్మకాండలను వాయిదా వేశారు. కాగా, ఇంటికి తిరిగి వచ్చిన సురేంద్ర తన మొబైల్ ఫోన్ పాడైందని చెప్పాడు. అందుకే రెండు నెలలుగా కుటుంబ సభ్యులకు ఫోన్ చేయలేదని చెప్పాడు. ఇక సురేంద్ర బతికే ఉన్నాడని తెలుసుకున్న రాజస్థాన్ పోలీసులు.. రోడ్డు ప్రమాదంలో గాయపడి చనిపోయిన వ్యక్తిని గుర్తించే పనిలో ఉన్నారు. ఈ విషయమై అతని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన సురేంద్ర ఫ్యామిలీని విచారిస్తున్నారు.