వారానికి అరకిలో.. బరువు తగ్గేలా ఛాలెంజ్
వారానికి అరకిలో.. బరువు తగ్గేలా ఛాలెంజ్.
వివిధ అనారోగ్య సమస్యలకు అధిక బరువే కారణమవుతుంది. అది తగ్గించేందుకే ఎక్కువ మంది ప్రయత్నిస్తున్నారు. కానీ.. ఎంత బరువు ఎంత సమయంలో తగ్గాలి? ఎలా తగ్గాలి? అనే దానిపై అవగాహన ఉండాలంటున్నారు నిపుణులు.
కేవలం వ్యాయామంతోనే బరువు తగ్గడం సాధ్యం కాదు. దానికి తగ్గట్టుగా ఆహారపు అలవాట్లలోనూ మార్పులు చేసుకోవాలి. అప్పుడే అనుకున్న ఫలితం దక్కుతుంది.
అలా అని ఒకేసారి ఆహారంలో పూర్తిగా మార్పులు, పరిమాణం తగ్గించడం చేస్తే అస్వస్థతకు గురవుతారు. ఏ మార్పునైనా తీసుకోవడానికి శరీరానికి కాస్త సమయం పడుతుంది. నిదానంగా అలవాటు చేసుకోవాలి.
కేలొరీలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడానికి ఓ ప్రణాళికని సిద్ధం చేసుకోవాలి. అందులో పోషకాహారం లేకపోతే శరీరానికి సరిపడా శక్తి లభించదని గుర్తుంచుకోండి.
వేపుళ్లు, పచ్చళ్లు, ప్రాసెస్డ్, జంక్ ఫుడ్ని పూర్తిగా దూరం పెట్టాలి. వీటి వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. బరువు తగ్గాలనుకున్న వారు వీటిని అస్సలు తీసుకోకూడదు.
తినే ముందు ఎలా వండుతున్నారో గమనించుకోవాలి. గ్రిల్లింగ్, స్టీమింగ్, బేకింగ్ చేసినవి తినాలి. ఎక్కువ నూనె వాడి కూరలను వేయించడం వల్ల శరీరంలో అదనపు కొవ్వులు చేరుకుంటాయి.
తాజా కూరగాయలు, పండ్లను ఆహారంలో ఎక్కువ మొత్తంలో చేర్చుకోవాలి. కార్బోహైడ్రేట్లను తగ్గించాలి. ఒక కప్పు అన్నంతో పాటు రెండు కప్పుల కూర ఉండేలా చూసుకోవాలి. సలాడ్లకి ప్రాధాన్యం ఇవ్వాలి.
రాగులు, కొర్రలు, జొన్నలు వంటి తృణధాన్యాలను ఉపయోగించి రొట్టెలు, దోశలు చేసుకోవచ్చు. వీటి వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. బరువూ తగ్గొచ్చు.
ఇక వ్యాయామం విషయానికొస్తే.. జాయిన్ అయిన మొదటి రోజే జిమ్లో గంటల కొద్దీ శ్రమించడంతో రెండో రోజు లేచి నిలబడేందుకు కూడా ఓపిక ఉండదు. నిదానంగా చిన్న చిన్న స్ట్రెచ్లతో మొదలుపెట్టాలి.
వాకింగ్ చేసినా బరువు తగ్గుతారు. రోజూ క్రమంగా కొంత సమయాన్ని కేటాయించుకొని నడవాలి. ఈ అంశాలన్నీ పాటిస్తే వారానికి కనీసం అరకిలో అయినా బరువు తగ్గే అవకాశాలున్నాయి.