ఆహారం తోనూ ఒత్తిడే
ఆహారం తోనూ ఒత్తిడే
మన శరీరంలో జరిగే అనేక మార్పులకు ఆహారమూ కారణమే.. కొన్ని ఆహార పదార్థాల వల్ల కూడా శరీరం ఒత్తిడికి లోనవుతుంటుంది అంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం..
చక్కెరతో చేసిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మూడ్ స్వింగ్స్ అధికంగా ఉంటాయి. ఒత్తిడి, చిరాకు కలుగుతాయి. పండ్లు, తేనె వంటి సహజ పదార్థాలతో తీపి తినాలనే కోరికను అదుపు చేయొచ్చు.
ప్రిజర్వేటివ్స్ కలిపి ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్యాన్ని కలిగించే కొవ్వులు కూడా ఉంటాయి. చిప్స్ వంటి ఇతరత్రా ఫ్రైడ్ స్నాక్స్కి దూరంగా ఉండాలి. ఫ్రై చేసిన ఆహారంలో అధిక శాతంలో కొవ్వు ఉంటుంది. అలాంటివి తినడం వల్ల శరీరం ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ని గ్రహించకుండా అడ్డుపడతాయి. దీని వల్ల ఒత్తిడి పెరుగుతుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచేందుకు ఇప్పుడు చాలా మంది ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ని వినియోగిస్తున్నారు. దీని వల్ల తెలియకుండానే చిరాకు, ఒత్తిడితో పాటు దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి. అధికంగా ఉప్పు ఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఒత్తిడితో పాటు భావోద్వేగాలు కూడా అదుపులో ఉండవు. ఉప్పు వల్ల దీర్ఘకాలిక సమస్యలూ వస్తాయి. కొంతమంది ఒత్తిడిని తగ్గించుకునేందుకు కాఫీని తీసుకుంటారు. కానీ శరీరంలో కెఫీన్ ఎక్కువైనా సరే.. ఇబ్బందే. వికారం, చిరాకును కలిగిస్తుంది. ఆహారం అరుగుదలపైనా ఈ ప్రభావం పడుతుంది. పాల పదార్థాలు తీసుకోవడం మంచిదే.. కానీ వాటిలో అధిక మొత్తంలో కొవ్వులు ఉన్నవి తీసుకోకూడదు. దీనివల్ల ఒత్తిడితో పాటు భావోద్వేగాల్లో హెచ్చు తగ్గులు ఉంటాయంటున్నారు నిపుణులు.