Central Govt: క్యాబినెట్ మంత్రికి..సహాయ మంత్రికి తేడాలేంటి!
Central Govt: క్యాబినెట్ మంత్రికి..సహాయ మంత్రికి తేడాలేంటి!
సీనియర్లు క్యాబినెట్ హోదాలో ఉంటారు.. తమకు కేటాయించిన ఆయా మంత్రిత్వ శాఖలకు వీరు నేతృత్వం వహిస్తారు. క్యాబినెట్ మంత్రి ఆధ్వర్యంలోని ఆ శాఖ పరిపాలన వ్యవహారాలు కొనసాగుతాయి. అయితే కేంద్ర మంత్రుల విధుల నిర్వహణలో వీరికి సహాయ మంత్రులు అంటే మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ సహకరిస్తుంటారు.
పని విభజనలో భాగంగా ఆ శాఖ పరిధిలోని కొన్ని ప్రధాన విభాగాల బాధ్యతలను క్యాబినెట్ మంత్రి వీరికి అప్పగిస్తారు. సహాయ మంత్రులు ఏ పని చేసినా ఎలాంటి నివేదక తయారు చేసినా క్యాబినెట్ మంత్రికే నివేదిస్తారు. స్వతంత్ర హోదా పొందిన సహాయ మంత్రులు తమ శాఖలను స్వతంత్రంగా నిర్వహిస్తారు. సాధారణంగా ఇలాంటి శాఖల పరిధి తక్కువగా ఉంటుంది. ఆ శాఖకు చెందిన పాలన నిర్ణయాల్లో పూర్తి నిర్ణయాధికారం వీరికి ఉంటుంది. తమ శాఖ నివేదికలను వీరు నేరుగా ప్రధానమంత్రికి నివేదిస్తారు.
క్యాబినెట్ ర్యాంక్ మంత్రులతో పోలిస్తే రెండు రకాల సహాయ మంత్రుల హోదా పొందే సౌకర్యాలు భత్యాలు తక్కువగా ఉంటాయి.. సహాయ మంత్రులు, మంత్రిమండలి సమావేశాలకు మినహా క్యాబినెట్ సమావేశాలకు హాజరు కారు. క్యాబినెట్ మీటింగ్ ఎజెండాలో స్వతంత్ర హోదా పొందిన సహాయ మంత్రుల శాఖలకు సంబంధించిన అంశాలు ఉంటే వారు హాజరవుతారు. లేదంటే వారు క్యాబినెట్ మీటింగ్ కి హాజరు కారు. ప్రోటోకాల్ ప్రకారం సహాయ మంత్రులకు శాఖ సంబంధిత నిర్ణయాలు ఆయా శాఖల కార్యదర్శులు తెలియజేస్తారు. పార్లమెంట్ సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో క్యాబినెట్ మంత్రి అందుబాటులో లేకుంటే ప్రభుత్వం తరపున ఆ శాఖ సహాయ మంత్రి జవాబులు ఇచ్చే అవకాశం ఉంటుంది.