Crying: కన్నీటి వల్ల ప్రయోజనాలు..ఒత్తిడిని తగ్గించే హర్మోన్లు విడుదల
Crying: కన్నీటి వల్ల ప్రయోజనాలు..ఒత్తిడిని తగ్గించే హర్మోన్లు విడుదల
శోకం నుంచి తేరుకునే శక్తి సమకూరుతుందని నిపుణుల సూచన..
ఒత్తిడిని తగ్గించే హార్మోన్లు విడుదలవుతాయని వివరణ..
శారీరకంగా, మానసికంగా బలంగా తయారవుతారని వెల్లడి..
శారీరకంగా తట్టుకోలేని నొప్పి కలిగినా, మానసిక వేదన కలిగినా కన్నీరు పెడుతుంటాం.. చివరకు సంతోషం ఎక్కువైనా కన్నీళ్లతో స్పందించడం ఎప్పుడో ఒకసారి అందరికీ అనుభవంలోకి వచ్చే ఉంటుంది. మరి ఏడుపు ఎందుకు వస్తుంది.. ఏడ్వడం వల్ల ఏం జరుగుతుంది.. ఏడ్వడం మంచిదేనా? ఈ విషయంపై వైద్య నిపుణులు చెప్పిన వివరాలు..మనుషుల భావోద్వేగాలలో ఏడుపు కూడా ఒకటని, శారీరక, మానసిక ఆవేదనను కన్నీటితో బయటకు వెలిబుచ్చుతుంటారని నిపుణులు చెబుతున్నారు. బాధలో ఉన్న వ్యక్తి కాసేపు ఏడ్చిన తర్వాత తేరుకుంటారని, మానసికంగా కొంత ఉపశమనం కలుగుతుందని వివరించారు. దీనికి కారణం కన్నీరు పెట్టినపుడు పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ యాక్టివేట్ అయ్యి ఎండార్ఫన్ ను విడుదల చేస్తుందని చెప్పారు. దీనివల్ల బాధ నుంచి తేరుకుంటారని వివరించారు. అందుకే తట్టుకోలేని బాధ కలిగినా, సంతోషం కలిగినా మనుషులకు ఆటోమేటిక్ గా కన్నీరు వస్తుందని వివరించారు. ఓదార్పు కోరుకోవడానికి మనుషులు వెలువరించే మూగ భాష కన్నీరు పెట్టడమని, దీనివల్ల సామాజిక బంధాలు మెరుగుపడతాయని చెప్పారు.
ప్రయోజనాలు ఇవే..
తమకు తాముగా బాధ నుంచి తేరుకోవడానికి కన్నీరు ఉపయోగపడుతుంది. పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ స్పందించి విడుదల చేసే ఎండార్పిన్స్ వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. శారీరక, మానసిక నొప్పి నుంచి తేరుకుంటారు. ఒత్తిడి తగ్గుతుంది. నిరాశ దూరమవుతుంది. మానసిక స్థితిలో మార్పుకు దోహదం చేస్తుంది. హాయిగా నిద్రించే అవకాశం కలుగుతుంది. దీంతో శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెప్పారు. కంటిచూపు కూడా మెరుగుపడుతుందని తెలిపారు. కన్నీరు పెట్టడం వల్ల కళ్లు పొడిబారే సమస్య తగ్గుతుందని, కళ్లలోకి చేరిన దుమ్ముధూళి కన్నీటి ద్వారా బయటకు వస్తుందని చెప్పారు. కళ్లను ఇన్ ఫెక్షన్ నుంచి దూరంగా ఉంచుతుందని వివరించారు. చిన్నపిల్లలు ఏడ్వడం వల్ల శ్వాస తీసుకునేందుకు సాయపడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అప్పుడే పుట్టిన శిశువును సున్నితంగా కొట్టి ఏడ్పించడం వెనకున్న కారణం ఇదేనని వివరించారు. దీనివల్ల పిల్లలు శ్వాస పీల్చే వేగం పెరిగి మరింత ఆక్సిజన్ శరీరంలోకి చేరుతుందని చెప్పారు.
ఎంతసేపు ఏడ్వాలి..?
ఏడ్వడం మంచిదని చెబుతున్న నిపుణులు ఎంతసేపు ఏడ్వాలనే విషయంపై స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఒక్కొక్కరి పరిస్థితి, శారీరక మానసిక స్థితి ఒక్కోలా ఉంటుంది కాబట్టి ఇంతసేపు ఏడ్వాలని చెప్పలేమని వివరించారు. పరిస్థితుల ప్రభావం, కలిగిన బాధ, వేదనను బట్టి ఏడ్చే సమయం, విధానం మారుతుందని తెలిపారు. ఈ విషయంపై అమెరికాలో జరిగిన ఓ అధ్యయనంలో వెలుగు చూసిన విషయాలను నిపుణులు ప్రస్తావించారు. సగటున ప్రతీ అమెరికన్ మహిళ నెలలో 3.5 సార్లు ఏడుస్తుందని, అదే అమెరికన్ పురుషులు సగటున నెలకు 1.9 సార్లు మాత్రమే ఏడుస్తారని, అదే చైనా మహిలలైతే నెలలో సగటున 1.4 సార్లు మాత్రమే ఏడుస్తారని చెప్పారు.