Health News: మనం రోజూ వాడే నూనె మంచిదా..కాదా..! కల్తీ నూనెను గుర్తించడం ఎలా..?
Health News: మనం రోజూ వాడే నూనె మంచిదా..కాదా..! కల్తీ నూనెను గుర్తించడం ఎలా..?
పండుగొచ్చిందంటే నూనెలు తెగ కాగాల్సిందే! శుద్ధమైన పల్లీనూనె సలసల మసులుతుంటే… ఆ పరిమళం వాడకట్టునంతా కట్టిపడేస్తుంది. కానీ కల్తీ నూనెలు రాజ్యమేలడం మొదలయ్యాక ఆ సువాసనలు మాయమైపోయాయి. తిరగమోతలో రుద్రాక్ష పరిమాణంలో ఇంగువ వేసినా.. వాసన వంటింటి గుమ్మం దాటకుండా తయారైంది. దీనికంతటికీ కల్తీ నూనే కారణం. అయితే ఏది మంచి నూనో, ఏది కల్తీ నూనో కనిపెట్టడం బ్రహ్మవిద్యేం కాదు. చిన్నచిన్న చిట్కాలతో ఇట్టే తెలుసుకోవచ్చు.
ఒక తెల్ల కాగితం తీసుకొని.. కొద్దిగా నూనె వేసి ఆరబెట్టాలి. నూనె స్వచ్ఛమైనది అయితే.. అది వృత్తంలాగా వ్యాపిస్తుంది. అదే నకిలీదైతే పేపర్‌పై పూర్తిగా ఇంకిపోకుండా పక్క దారులకు పాకుతుంది.
ఒక గిన్నెలో కొంచెం నూనె పోసి ఫ్రీజర్‌లో ఉంచాలి. స్వచ్ఛమైన నూనైతే ఘనీభవిస్తుంది. కల్తీదైతే అలాగే ద్రవరూపంలో ఉంటుంది. స్వచ్ఛమైన ఆలివ్ ఆయిల్ ఫ్రీజర్‌లో ఉంచితే 30 నిమిషాల్లో గడ్డ కడుతుంది. అలా కాలేదంటే… దాల్ మే కుచ్ కాలాహై అనుకోవచ్చు!
స్వచ్ఛమైన పల్లీనూనె సువాసన కలిగి ఉంటుంది. కల్తీదైతే.. కాస్త చేదు వాసన వస్తుంటుంది. అంతేకాదు కల్తీనూనె కాస్త చిక్కగా ఉంటుంది. ఈ విషయాలు పరిశీలించి కల్తీనూనె బారినపడకుండా జాగ్రత్తపడండి.