Inter Results: ఆన్లైన్ లో మూల్యాంకనం..ఇంటర్ విద్యార్థులకు కొత్త చిక్కులు
Inter Results: ఆన్లైన్ లో మూల్యాంకనం..ఇంటర్ విద్యార్థులకు కొత్త చిక్కులు
సప్లిమెంటరీ మూల్యాంకనంలో ఏకపక్ష మార్పులు..
ఆన్ లైన్ విధానానికి మార్చడంతో సమస్య..
జవాబుపత్రం డౌన్ లోడ్ కావట్లేదని జూనియర్ లెక్చరర్ల ఫిర్యాదు..
పది రోజులు దాటినా ఇంకా 35 శాతం కూడా పూర్తికాని మూల్యాంకనం..
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ విద్యార్థులు కొత్త చిక్కులు ఎదుర్కొంటున్నారు. వైసీపీ సర్కారు చేసిన ప్రయోగంతో విద్యార్థుల్లో టెన్షన్ నెలకొంది. ఓవైపు డిగ్రీ, పాలిటెక్నిక్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్లు విడుదల అవుతున్నా ఇంకా మూల్యాంకనం ఓ కొలిక్కి రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సప్లిమెంటరీ, బెటర్ మెంట్ కోసం పరీక్ష రాసిన విద్యార్థులు తమ ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారోనని ఎదురుచూస్తున్నారు. మూల్యాంకనం విషయంలో గత ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయమే ఈ టెన్షన్ కు కారణమని తెలుస్తోంది.
సప్లిమెంటరీ జవాబు పత్రాలను ఆన్ లైన్ విధానంలో మూల్యాంకనం చేయాలని ఇంటర్ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో మూల్యాంకనంలో ఆలస్యం అవుతోందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే మూల్యాంకనం ప్రారంభించి పదిరోజులు దాటినా ఇంకా 35 శాతం పేపర్లు కూడా పూర్తికాలేదని వివరించారు. ఈ లెక్కన జవాబు పత్రాల మూల్యాంకనం ఎప్పుడు పూర్తవుతుంది.. ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారనే విషయంపై అధికారులు కూడా జవాబు చెప్పలేకపోతున్నారు.
సమస్య ఎక్కడంటే..
ఇంటర్ విద్యార్థుల జవాబుపత్రాలను ఈ ఏడాది కూడా సాధారణ (మాన్యువల్) పద్ధతిలోనే జూనియర్ లెక్చరర్లు మూల్యాంకనం చేశారు. సప్లిమెంటరీ విషయానికి వచ్చేసరికి ప్రభుత్వం ఆన్ లైన్ లో చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈసారి 5 లక్షల మంది విద్యార్థులు సప్లిమెంటరీ, బెటర్ మెంట్ పరీక్షలు రాశారు. మొత్తంగా 12.7 లక్షల పేపర్లు (బుక్ లెట్లు) వచ్చాయి. ఒక్కో బుక్ లెట్ లోని 24 పేజీలను అధికారులు స్కాన్ చేసి వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశారు. జూనియర్ లెక్చరర్లు వాటిని డౌన్ లోడ్ చేసుకుని మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది.
చాలాచోట్ల జవాబు పత్రాలు డౌన్ లోడ్ కావడంలేదని జూనియర్ లెక్ఛరర్లు చెబుతున్నారు. దీంతో మూల్యాంకనం వేగంగా జరగడంలేదని అధికారులు వివరించారు. గతేడాది జూన్ 13న సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కాగా.. ఈసారి మాత్రం ఈ నెల 20 కైనా వస్తాయనే నమ్మకం లేదని అంటున్నారు. దీంతో అధికారులు మూల్యాంకనంలో వేగం పెంచేందుకు చర్యలు చేపట్టారు. టీచింగ్ సహా ఇతరత్రా పనులేవీ పెట్టుకోకుండా మూల్యాంకనం పూర్తిచేయాలని జూనియర్ లెక్చరర్లను ఆదేశించారు.