Vegetable Rates: ఆకాశాన్ని తాకుతున్న ధరలు..ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజలు..!
Vegetable Rates: ఆకాశాన్ని తాకుతున్న ధరలు..ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజలు..!
అమాంతం పెరిగిన కూరగాయల ధరలు..
తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన కూరగాయల ధరలు..
ఇబ్బంది పడుతున్న సామాన్యులు..
రాష్ట్రంలో తగ్గిన కూరగాయల సాగు..
తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఏ కూరగాయ కొందామన్నా సామాన్యులు బాబోయ్ అనే పరిస్థితి నెలకొంది. డిమాండ్‌కు తగ్గట్టు ఉత్పత్తి లేకపోవడంతో కూరగాయలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
ఈ ఏడాది వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో కూరగాయల ఉత్పత్తి తగ్గిపోగా.. డిమాండ్ పెరిగి ధరలు భగ్గుమంటున్నాయి. రేట్లు పెరగడంతో సామాన్యులతో పాటు వ్యాపారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు వర్షాలతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు సంభవించగా.. కూరగాయలు త్వరగా కుళ్లిపోతుండడంతో వ్యాపారస్తులు దిగుమతులను క్రమంగా తగ్గించగా.. రాష్ట్రంలో కూరగాయల సాగు కూడా తగ్గింది. వీటి ప్రభావంతో ప్రస్తుతం మార్కెట్‌లో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. చేతినిండా డబ్బులు తీసుకెళ్లిన సంచి సగానికి కూడా కూరగాయలు రావట్లేదంటూ సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ రైతు బజార్లలోని ధరలతో పోలిస్తే బహిరంగ మార్కెట్లలో 30 నుంచి 50 శాతం వరకు ధరలు అధికంగా ఉన్నాయి. ప్రస్తుతం కేజీ ఉల్లి ధర రూ. 35 రైతు బజార్‌లో ఉంటే.. బహిరంగ మార్కెట్‌లో రూ.40 నుంచి 45 వరకు పలుకుతోంది. ఇక టమాటాను కొనేటట్టు లేదు. రెండు వారాల్లోనే టమాట రేట్లు భారీగా పెరిగాయి. ఏకంగా కేజీ ధర రూ. 40 నుంచి 50 మధ్య నడుస్తోంది. బహిరంగ మార్కెట్‌లో ఇంకా ఎక్కువకు అమ్ముతున్నారు. పచ్చిమిర్చి ధర ఘాటెక్కింది. పచ్చిమిర్చి రైతు బజార్‌లో రూ.65 నుంచి 80 మధ్య ఉంది. ఇక బీన్స్ ధర చెప్పలేనంత స్థాయిలో పలుకుతోంది. కిలో ధర రూ. 110 నుంచి 120 మధ్య విక్రయిస్తున్నారు. చిక్కుడ ధర రూ. 50 నుంచి రూ. 60 మధ్య ఉంది. బెండకాయ కిలో ధర రూ. 50 – 60 మధ్య ఉంది. క్యాప్సికం, పుదీనా, కొత్తిమీర ఇతర ఆకుకూరల ధరలు కూడా రెట్టింపయ్యాయి. వానాకాలం సాగుకు సంబంధించి ఆగస్టు వరకు పంటలు చేతికి వచ్చే అవకాశం ఉంది. ఆ ఉత్పత్తులు మార్కెట్‌కు చేరితే ధరలు తగ్గే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఏపీలోని పలు జిల్లాల్లో కూడా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అమాంతం పెరిగిన నిత్యావసరాల ధరలను చూసి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.