IRDA: పత్రాల్లేవని క్లెయిమ్ ఆపొద్దు
పత్రాల్లేవని క్లెయిమ్ ఆపొద్దు
న్యూఢిల్లీ, జూన్ 12 (పీపుల్స్ మోటివేషన్):-
కావాల్సిన పత్రాలు లేవంటూ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీదారుల క్లెయిమ్‌లను తిరస్కరించరాదని బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ మంగళవారం స్పష్టం చేసింది. అవసరమైన పత్రాలను క్లెయిమ్ ప్రతిపాదనను పూర్తి చేస్తున్న సమయంలోనే అడుగాలన్నది. అయితే క్యాష్‌లెస్ సదుపాయం అందుబాటులో లేకపోతే క్లెయిమ్ సెటిల్మెంట్‌కు సంబంధించిన లేదా అవసరమైన పత్రాలను ముందుగానే అడుగవచ్చన్నది
ఈ మేరకు ఓ మాస్టర్ సర్క్యులర్‌ను విడుదల చేసింది.
జనరల్ ఇన్సూరెన్స్ వ్యాపారంపై ఇచ్చిన ఈ సమగ్ర మాస్టర్ సర్క్యులర్‌తో గత 13 సర్క్యులర్‌లు రైద్దెపోయాయి. ఇక క్లెయిమ్‌లను బీమా కంపెనీలు వేగంగా పరిష్కరించాలని, సర్వేయర్ల నియామకం, వారి నివేదికల సమర్పణ చకచకా జరిగిపోవాలని కూడా ఐఆర్డీఏఐ ఆదేశించింది.
సమయానికి సర్వే రిపోర్టులను పొందడం బీమా సంస్థల బాధ్యతన్నది. పాలసీదారులకు వారు తీసుకున్న బీమాకు సంబంధించిన పూర్తి అవగాహన కోసం కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ ఇవ్వాలని, అందులో బీమా కవరేజీ, మినహాయింపులు, వారంటీలు, క్లెయిమ్ పరిష్కార ప్రక్రియ వంటివి వివరంగా ఉండాలని ఈ సందర్భంగా బీమా సంస్థలకు ఐఆర్డీఏఐ సూచించింది.