Nara Lokesh: జులై 15 నాటికి ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ ఇవ్వండి..!
Nara Lokesh: జులై 15 నాటికి ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ ఇవ్వండి..!
విద్యాశాఖ అధికారులతో నారా లోకేశ్ సమీక్ష..
విద్యారంగం మౌలిక సదుపాయాలు, డ్రాప్ అవుట్స్ పై చర్చ..
మధ్యాహ్న భోజనం, సిలబస్ పై అధికారులకు సూచనలు..
పలు అంశాలపై నివేదికలు కోరిన లోకేశ్..
అమరావతి (పీపుల్స్ మోటివేషన్):-
మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ ఉండవల్లిలోని తన నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో నేడు సమీక్ష నిర్వహించారు. విద్యా రంగం మౌలిక సదుపాయాలు, డ్రాప్ అవుట్స్ తదితర అంశాలపై చర్చించారు. విద్యావ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుడుతున్నట్టు లోకేశ్ తెలిపారు.
ఏడాదిలోగా పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఇంటర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జులై 15 నాటికి పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాక్ పాక్ ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. గత ప్రభుత్వం ఇంటర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాక్ పాక్ ఇవ్వకపోవడం పట్ల లోకేశ్ ఆశ్చర్యానికి గురయ్యారు. పాఠ్యపుస్తకాలు ఇవ్వకుండా విద్యార్థులు ఎలా చదువుతారని అధికారులతో అన్నారు. తక్షణమే పాఠ్యపుస్తకాల పంపిణీ కి ఏర్పాటు చెయ్యాలని ఆదేశించారు.
కొత్తగా చేపట్టాల్సిన పనులతో పాటు గత ప్రభుత్వ హయాంలో అర్ధంతరంగా నిలిచిపోయిన ఫేజ్-2 పనులు, ఫేజ్-3 పనులన్నీ ఏడాదిలోగా పూర్తిచేయాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంపై అధికారులను లోకేశ్ ఆరా తీశారు. మధ్యాహ్న భోజనం రుచిగా, నాణ్యతతో ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా మధ్యాహ్న భోజన పథకం డైరక్టర్ అంబేద్కర్ కు లోకేశ్ సూచించారు.
పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఇతర రాష్ట్రాల్లో స్కూల్స్ శానిటేషన్ కు సంబంధించిన విధానాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.
అదే విధంగా గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు మారిన విద్యార్థుల సంఖ్య, అందుకు గల కారణాలను విశ్లేషించి సమగ్ర నివేదిక ఇవ్వాలని సమగ్ర శిక్ష అభియాన్ ఎస్పీడీని ఆదేశించారు. బడిలో చేరి మధ్యలో మానేసిన జనరల్ డ్రాప్ అవుట్స్ వివరాలు కూడా అందజేయాలని స్పష్టం చేశారు. ఆయా గ్రామాల్లో విద్యార్థులకు పాఠశాల ఎంత దూరంలో అందుబాటులో ఉంది అనే వివరాలతో నివేదిక రూపొందించాలని కోరారు. గత ఐదేళ్లలో ఎన్ని పాఠశాలలు మూతపడ్డాయి, అందుకు గల కారణాలను కూడా తెలియజేయాలని అన్నారు.
దేశంలోనే బెస్ట్ లైబ్రరీ మోడల్ ఎక్కడ ఉందో తెలుసుకుని, సమీక్ష చేసి అందుకు సంబంధించిన నోట్ ను కూడా అందజేయాలని లైబ్రరీస్ డైరెక్టర్ ను ఆదేశించారు. బైజూస్ కంటెంట్, ఐఎఫ్ బీ వినియోగం మీద సమగ్ర నోట్ ను సమర్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. సీబీఎస్ఈ పాఠశాలల మీద సమగ్ర నోట్ తో పాటు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయబోయే 82 వేల మంది విద్యార్థులకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారు, అదే విధంగా ఈ ఏడాది కాలంలో విద్యార్థులకు ఏ రకమైన శిక్షణ ఇవ్వాలో సమగ్ర నోట్ ఇవ్వాలని మంత్రి లోకేశ్ అధికారులకు నిర్దేశించారు.
ఇక, గత టీడీపీ ప్రభుత్వంలో కొనుగోలు చేసి, ఆ తర్వాత ప్రభుత్వంలో మూలన పడేసిన సైకిళ్ల వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. ఇకపై ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా జరుగుతాయని లోకేశ్ స్పష్టం చేశారు. గతంలో తమ ప్రభుత్వం అమలు చేసిన పారదర్శక విధానాలను మళ్లీ తీసుకువస్తామని చెప్పారు. అదేవిధంగా పూర్తిస్థాయిలో కేంద్ర నిధులను వినియోగించుకునే విధంగా తగిన ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు ఆదేశించారు.
ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ సౌరభ్ గౌర్, స్కూల్ ఇన్ ఫ్రా కమిషనర్ భాస్కర్ కాటమనేని, స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు, మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ అంబేద్కర్, వయోజన విద్య డైరెక్టర్ శ్రీమతి నిధి మీనా, పబ్లిక్ లైబ్రరీస్ డైరెక్టర్ ప్రసన్న కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.