TRAI: ట్రాయ్ కొత్త సిఫార్సులు.. ఫోన్ నంబరూ ఇక ఛార్జీలు..?
TRAI: ట్రాయ్ కొత్త సిఫార్సులు.. ఫోన్ నంబరూ ఇక ఛార్జీలు..?
ఫోన్ నంబర్ కు త్వరలో ఛార్జీ చెల్లించాల్సి రావొచ్చు. ఈ మేరకు త్వరలో ట్రాయ్ సిఫార్సులు సిద్ధం చేసింది
సిమ్ కార్డు పొందాలంటే కొన్నేళ్ల క్రితం కష్టంతో పాటు కొంత మొత్తం రుసుము చెల్లించాల్సి ఉండేది. తర్వాతి కాలంలో టెలికాం కంపెనీల మధ్య పోటీ కారణంగా ఉచితంగా సిమ్కార్డులు జారీ మొదలైంది. దీంతో చాలా మంది ఇబ్బడిముబ్బడిగా సిమ్ కార్డులు తీసుకునేవారు. అందులోని ప్రయోజనాలు వినియోగించుకుని పక్కన పడేసేవారు. ఫోన్ నంబర్ల (Phone numbers) జారీపై గరిష్ఠ పరిమితి వచ్చాక ఈ తరహా దుర్వినియోగం తగ్గింది. ఈ క్రమంలోనే టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) కొత్త సిఫార్సులకు సిద్ధమైంది. ఫోన్ నంబర్కు, ల్యాండ్లైన్ నంబర్కు ఛార్జీలు వసూలు చేయాలనుకుంటోంది. అదే జరిగితే మొబైల ఆపరేటర్ల నుంచి తొలుత ఈ ఛార్జీలు వసూలు చేస్తే.. ఆయా కంపెనీలు యూజర్ల నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేసుకునే అవకాశం ఉంటుంది.
సహజ వనరుల్లానే ఫోన్ నంబర్ కూడా చాలా విలువైనది ట్రాయ్ భావిస్తుండడమే దీనికి కారణం. ఫోన్ నంబర్లేమీ అపరిమితం కాదు కాబట్టి, దుర్వినియోగానికి చెక్ పెట్టాలని భావిస్తోందని ఓ ఆంగ్ల పత్రిక తన కథనంలో పేర్కొంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న చాలా మటుకు మొబైల్ ఫోన్లు డ్యూయల్ సిమ్ కార్డు ఆప్షన్తో వస్తున్నాయి. కొందరు రెండో సిమ్ కార్డు వాడుతున్నప్పటికీ.. ఎప్పుడోగానీ వాటికి రీఛార్జి చేయడం లేదు. అయితే, కస్టమర్ బేస్ తగ్గిపోతుందన్న భయంతో ఆయా కంపెనీలు కూడా అలాంటి నంబర్ల జోలికి పోవడం లేదు. వాటిని తొలగించడంలో జాప్యం చేస్తున్నాయి. దీంతో తక్కువ వినియోగం కలిగిన నంబర్ల విషయంలో ఆయా టెలికాం కంపెనీలకు పెనాల్టీ సైతం విధించాలని ట్రాయ్ భావిస్తోంది.
సాధారణంగా స్పెక్ట్రమ్ తరహాలోనే నంబరింగ్ స్పేస్ను కూడా ప్రభుత్వమే ఆయా కంపెనీలకు కేటాయిస్తుంది. గతేడాది డిసెంబర్ లో ఆమోదం పొందిన టెలికాం చట్టంలోనూ నంబర్కు ఛార్జీ వసూలు చేయాలన్న నిబంధన ఉంది. అంతేకాదు వివిధ దేశాల్లోనూ నంబర్లకు ఛార్జీలు వసూలు చేస్తున్న విషయాన్ని సైతం ట్రాయ్ ప్రస్తావిస్తోంది. ఆస్ట్రేలియా, సింగపూర్, బెల్జియం, ఫిన్లాండ్, యూకే, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో నంబర్లకు ఛార్జీలు వసూలు చేస్తున్నారని పేర్కొంది. అయితే, ఒక్కో నంబర్కు ఒకసారి మాత్రమే వసూలు చేయాలా..? లేదా నంబరింగ్ సిరీస్కు ఏటా కొంత మొత్తం వసూలు చేయాలా? అనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ట్రాయ్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన సిఫార్సులను ట్రాయ్ త్వరలో ప్రభుత్వానికి అందించే అవకాశం ఉంది.