NEET: నీట్ అవకతవకలపై జూన్ 19, 20న దేశ వ్యాప్త సమ్మెకు విద్యార్థి సంఘాలు పిలుపు..
NEET: నీట్ అవకతవకలపై జూన్ 19, 20న దేశ వ్యాప్త సమ్మెకు విద్యార్థి సంఘాలు పిలుపు..
డిల్లీ (పీపుల్స్ మోటివేషన్):-
మెడికల్ అడ్మిషన్ల కోసం నిర్వహించిన జాతీయ స్థాయి అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)లో అక్రమాలు, అవకతవకలపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 19, 20న రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు వామపక్ష విద్యార్థి సంఘం శనివారం పిలుపునిచ్చింది. (strike over NEET row) గతంలో ఎన్నడూ లేని విధంగా నీట్‌లో రికార్డు స్థాయిలో 67 మంది విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారు. ఇందులో చాలా మంది అభ్యర్థులు హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రంలో నీట్ రాశారు. దీంతో చీటింగ్ లేదా పేపర్ లీక్ వల్ల వీరికి అధిక మార్కులు వచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే కొందరు విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వడాన్ని మిగతా విద్యార్థులు తప్పుబట్టారు.
కాగా, పరీక్షను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)లో అవినీతి, ఆ సంస్థ దుర్వినియోగంపై విద్యార్థులు మండిపడుతున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దీనిపై మౌనంగా ఉన్నారని ఆరోపించారు. నీట్ పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని, ఎన్‌టీఏ రద్దుపై స్వతంత్రంగా విచారణ జరుపాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) డిమాండ్ చేసింది. జూన్ 19, 20న దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. విద్యార్థులంతా ఈ సమ్మెలో పాల్గొనాలని కోరింది. మరోవైపు మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌కు హాజరైన 20 మంది విద్యార్థుల బృందం నీట్- యూజీ 2024 పరీక్షను రద్దు చేయాలని కోరుతూ శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే ఈ అంశంపై దాఖలైన ఇతర పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరుపుతోంది.