Road Accident: ఆగివున్న లారీని ఢీకొట్టిన టెంపో.. 13 మంది దుర్మరణం..
Road Accident: ఆగివున్న లారీని ఢీకొట్టిన టెంపో.. 13 మంది దుర్మరణం..
హవేరీ జిల్లాలో పూణె-బెంగళూరు రహదారిపై ఘటన
ఆలయాల సందర్శనకు వెళ్లి వస్తుండగా విషాదం
మృతుల్లో ఇద్దరు చిన్నారులు
తీవ్రంగా గాయపడిన మరో నలుగురు
కర్ణాటకలోని హవేరీ జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు భక్తులు టెంపోలో బెళగావిలోని ఆలయాలు దర్శించుకుని వస్తుండగా గుండెనహల్లి సమీపంలో పూణె-బెంగళూరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని టెంపో బలంగా ఢీకొట్టడంతో 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మృతులను షిమోగా జిల్లా భద్రవతి తాలూకాలోని ఎమ్మినిహట్టి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద తీవ్రతకు కొన్ని మృతదేహాలు టెంపోలో చిక్కుకుపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని అతికష్టం మీద మృతదేహాలను వెలికి తీశారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని ఆసుపత్రికి తరలించారు.