UGC NEET: యూజీసీ నెట్ కొత్త షెడ్యూల్ విడుదల..
UGC NEET: యూజీసీ నెట్ కొత్త షెడ్యూల్ విడుదల..
ఆగస్టు 21-సెప్టెంబర్ 4 మధ్య పరీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడి..
ఇకపై కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో నిర్వహణ..
కీలక ప్రకటన చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ..
అవకతవకలు జరిగాయంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమైన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ రద్దు చేసిన యూజీసీ-నెట్ ఎగ్జామ్‌కు కొత్త షెడ్యూల్ వెలువడింది. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 4, 2024 మధ్య పరీక్షను నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం పొద్దుపోయాక ప్రకటన విడుదల చేసింది. ఇక ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (AIAPGET) 2024 షెడ్యూల్ ప్రకారం జులై 6న నిర్వహించనున్నట్టు ధృవీకరించింది. మరోవైపు సీఎస్ఐఆర్ నెట్ పరీక్ష జులై 25-27 మధ్య జరగనుంది. దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థల్లో లెక్చర్‌షిప్‌లు, రీసెర్చ్ ఫెలోషిప్‌లు కోరుకునే అభ్యర్థులకు నెట్, సీఎస్ఐఆర్ పరీక్షలు చాలా కీలకమైనవి.
కాగా ఇప్పటివరకు పెన్ను, పేపర్ విధానంలో జరిగిన యూజీసీ-నెట్ ఎగ్జామ్‌ను ఇకపై కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించింది. కాగా జూనియర్ రీసెర్చ్ ఫెలోలు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీహెచ్‌డీ స్కాలర్‌ల ఎంపిక కోసం జూన్ 18న దేశవ్యాప్తంగా రెండు విడతలుగా యూజీసీ-నెట్ ఎగ్జామ్ జరిగింది. అయితే అవకతవకలు జరిగాయంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువడ్డాయి. విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయి. పరీక్ష సమగ్రత దెబ్బతినడంతో పరీక్షను రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పరీక్ష జరిగిన మరుసటి రోజే రద్దు చేసింది.