Crime News: దేశంలో సగటున రోజూ 39 మంది మహిళల అదృశ్యం.. దీని వెనక ఉన్నది ఎవరూ.?
Crime News: దేశంలో సగటున రోజూ 39 మంది మహిళల అదృశ్యం.. దీని వెనక ఉన్నది ఎవరూ.?
- దేశంలో ఏటా వేల మంది మహిళల మిస్సింగ్
- ఐదేండ్లలో కనిపించనివారు 2.31లక్షల మంది
- 2017 నుంచి 2022 వరకు 1.5 రెట్లు అధికం
నిత్యం దేశంలో ఎంతోమంది మహిళలు అదృశ్యమవుతున్నారు. వారిని ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేక వారికి వారే వెళ్లిపోయారా? వెళ్తే ఆ తర్వాతైనా వారి ఆచూకీ ఎందుకు లభించడం లేదు? మహిళలతో పాటు పిల్లల్ని కూడా అదృశ్యం చేస్తున్నది ఎవరు? వీరినెవరైనా అక్రమ మానవ రవాణా చేస్తున్నారా? ఇవన్నీ జవాబులేని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి.
అదృశ్యమైన వారి గణాంకాలు కూడా ఏటికేడు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. దేశంలో ప్రతిరోజు సగటున 39 మంది మహిళలు కన్పించకుండా పోతున్నారు. వీరిలో మైనర్లు కూడా ఉన్నారు. రోజూ అద్యశ్యమవుతున్న వారిలో అధికంగా ఒడిశా నుంచే 13 మంది ఉన్నట్టు అధికారిక డాటా వెల్లడిస్తున్నది. ఇలా అదృశ్యమై వారి జాడ కూడా తెలియని మహిళల సంఖ్య దేశ వ్యాప్తంగా 2017 నాటికి 1.60 లక్షలు ఉండగా, 2022 నాటికి 2.31 లక్షలకు చేరుకుంది.
నేషనల్ క్రైమ్ రికార్డ్సు బ్యూరో వెల్లడించిన ‘భారత్‌లో నేరాలు’ వార్షిక నివేదికలో మైనర్లు సహా 70,649 మంది మహిళలను అదృశ్యమై కన్పించకుండా పోయిన జాబితాలో చేర్చినట్టు పేర్కొంది. 2017-2022 మధ్య ఈ డాటాను పరిశీలిస్తే అదృశ్యమైన వారిలో 67,476 మంది 18 ఏండ్ల పైబడిన వారు కాగా, 3,073 మంది మైనర్లు. 2017 చివరి నాటికి గణాంకాలు పరిశీలిస్తే 1.29 లక్షల మంది అదృశ్యమైన మహిళలు ఉండగా, 2022లో ఈ సంఖ్య 1.97 లక్షలకు పెరిగింది. అలాగే తప్పిపోయిన మైనర్ బాలికల సంఖ్య అదే కాలంలో పోలిస్తే 30,725 నుంచి 33,798కి పెరిగింది.
ఏటా పెరుగుదల నమోదు
2017 నుంచి 2022 వరకు పరిశీలిస్తే అదృశ్యమవుతున్నవారి సంఖ్యలో క్రమంగా పెరుగుదల నమోదైంది. ఈ అయిదేళ్ల కాలంలో 14.41 లక్షల మంది మహిళలు అదృశ్యం కాగా, అందులో 13.84 లక్షల మంది అచూకీని కనుగొన్నారు. ఇక ఒడిశాలో ఈ ఐదేండ్ల లో 24,715 మంది మహిళలు, బాలికలు అదృశ్యమయ్యారు. వీరి సంఖ్య 2017లో 2,668 ఉండగా, అది 2022నాటికి పదిరెట్లకు పైగా పెరిగి 27,383కు చేరింది. ఈ విషయంలో మధ్యప్రదేశ్ రెండో స్థానంలో ఉంది.
అక్కడ 2017లో 25,997 మంది ఉండగా, 2022లో అది 35,759కు పెరిగింది. అయితే వాస్తవానికి 2017-22 కాలంలో పశ్చిమ బెంగాల్ అగ్రస్థానంలో ఉంది. ఆ సమయంలో అక్కడ 2017లో 33,083 మిస్సింగ్ కేసులు, 2022లో 38,848 కేసులు నమోదయ్యాయి. అయితే మహారాష్ట్రలో కేసుల తగ్గుదల కన్పించింది. ఇక్కడ 2017లో 27,949 ఉండగా, 2022లో 23,342కి తగ్గింది. అలాగే తెలంగాణలో సైతం 2022 నాటికి 3,051 నుంచి 1,653కు తగ్గుదల నమోదైంది. ఈ విషయంలో ఒడిశా అతిపెద్ద మూడో రాష్ట్రంగా నిలిచింది.
పురుషులు సైతం..
దేశంలో కన్పించకుండా పోతున్న వారిలో పురుషులు సైతం ఉన్నారు. ఎన్‌సీఆర్‌బీ 2023 డిసెంబర్‌లో ప్రచురించిన డాటా ప్రకారం 2022 నాటికి దేశంలోని వివిధ రాష్ర్టాలు, యూటీల్లో మొత్తం 3.83 లక్షల మంది అదృశ్యమయ్యారు. వీరిలో 1.52 లక్షల మంది పురుషులు, 21 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. అదే సమయంలో 2017 నాటికి దేశంలో 2.97 లక్షల మంది అదృశ్యం కాగా, అందులో పురుషులు 1.37 లక్షల మంది, ట్రాన్స్‌జెండర్లు 163 మంది ఉన్నారు.