High court: విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పించే క్రమంలో దండించిన టీచర్ పై కేసు పెట్టొద్దు..కేరళ హైకోర్టు
High court: విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పించే క్రమంలో దండించిన టీచర్ పై కేసు పెట్టొద్దు..కేరళ హైకోర్టు
దురుద్దేశం లేకుంటే కేసు పెట్టొద్దని పోలీసులకు సూచన
విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పే బాధ్యత టీచర్ కు ఉందని వ్యాఖ్య
కేరళ స్కూలు టీచర్ పై పెట్టిన కేసు కొట్టివేసిన హైకోర్టు
విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పించే క్రమంలో దండించిన టీచర్ పై కేసు పెట్టొద్దని కేరళ హైకోర్టు పేర్కొంది. టీచర్ గా పిల్లలకు క్రమశిక్షణ నేర్పడం తన విధి అంటూ ఉపాధ్యాయురాలిని సమర్థించింది. సదుద్దేశంతో కొడితే కేసు పెట్టడం సరికాదని వ్యాఖ్యానించింది. ఈమేరకు కేరళకు చెందిన ఓ టీచర్ పై నమోదైన కేసును కొట్టివేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.
కేరళ తోత్తువలోని సెయింట్ జోసెఫ్ స్కూలులో ఎనిమిదవ తరగతి విద్యార్థినిని టీచర్ దండించింది. పరీక్షలో మార్కులు సరిగా రాకపోవడంతో టీచర్ జోమి 13 ఏళ్ల విద్యార్థినిని కొట్టారు. ఆ విద్యార్థిని తన తల్లిదండ్రులకు చెప్పడంతో పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. తమ కూతురును కొట్టిన టీచర్ పై ఫిర్యాదు చేశారు. దీంతో టీచర్ జోమితో పాటు స్కూలు ప్రిన్సిపాల్ పై జువెనైల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 75 కింద కొడనాడ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
దీనిపై టీచర్ జోమి కేరళ హైకోర్టును ఆశ్రయించారు. పరీక్షలో మార్కులు తక్కువ వచ్చాయనే కారణంతో విద్యార్థినికి క్రమశిక్షణ నేర్పేందుకే దండించాను తప్ప తనకు దురుద్దేశంలేదని వాదించారు. టీచర్ వాదనతో ఏకీభవించిన హైకోర్టు.. పిల్లలను క్రమశిక్షణతో ఉంచేందుకు తల్లిదండ్రులు ఇచ్చిన అవ్యక్త అధికారంతోనే టీచర్ జోమి ఆ విద్యార్థినిని దండించారని వ్యాఖ్యానించింది. కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.