NEET UG 2024: వాయిదా పడిన నీట్ యూజీ కౌన్సెలింగ్.. త్వరలో కీలక ప్రకటన
NEET UG 2024: వాయిదా పడిన నీట్ యూజీ కౌన్సెలింగ్.. త్వరలో కీలక ప్రకటన
- పేపర్ లీక్ ఆరోపణలతో ఎగ్జాం రద్దు కోసం సుప్రీంను ఆశ్రయించిన విద్యార్థులు, పేరెంట్స్...
- ఈ నెల 8న విచారించనున్న అత్యున్నత న్యాయస్థానం...
- ఈ నేపథ్యంలోనే కౌన్సెలింగ్ రద్దు చేసినట్లు సమాచారం...
నీట్ యూజీ కౌన్సెలింగ్ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 6 (శనివారం) న కౌన్సెలింగ్ జరగాల్సి ఉంది. అయితే, నీట్ యూజీ పరీక్ష, కౌన్సెలింగ్ కు సంబంధించి పలు ఆరోపణలు వెల్లువెత్తడంతో పలువురు విద్యార్థులు, పేరెంట్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దీనికి సంబంధించి దాఖలైన వివిధ పిటిషన్లను ఈ నెల 8న విచారించనున్నట్లు అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే నీట్ యూజీ కౌన్సెలింగ్ వాయిదా పడ్డట్లు సమాచారం. తదుపరి ప్రకటన వచ్చే వరకు కౌన్సెలింగ్‌ను వాయిదా వేసినట్లు అధికారిక వర్గాలు ప్రకటించాయి.
నీట్ యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయని, పేపర్ లీక్ అయిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆందోళన చెందిన పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు కోర్టు మెట్లెక్కారు. నీట్ పరీక్షను రద్దు చేయాలని, ఈమేరకు ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పలువురు విద్యావేత్తలు కూడా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు గతంలో స్పందిస్తూ.. పరీక్షను రద్దు చేయడం, కౌన్సెలింగ్ ను వాయిదా వేయడం కుదరదని వ్యాఖ్యానించింది. అయితే, నీట్ యూజీ పరీక్షకు సంబంధించిన పిటిషన్లను విచారించేందుకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం అంగీకరించింది.