Liquor News: మధ్యం ప్రియులకు కిక్కిచ్చే న్యూస్..!
Liquor News: మధ్యం ప్రియులకు కిక్కిచ్చే న్యూస్..!
బెంగాల్, ఒడిశాలలో ఇప్పటికే అమలులో ఉన్న డోర్ డెలివరీ
ఢిల్లీ సహా ఏడు రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టు
అమలుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు
ఈ విధానం అమలులోకి వస్తే మందుబాబులకు నిజంగానే గుడ్ న్యూస్.. వైన్ షాపు దాకా వెళ్లాల్సిన పనిలేకుండా ఇంట్లో కూర్చుని మద్యం తెప్పించుకుని సేవించే అవకాశం కలుగుతుంది. త్వరలో ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, హరియాణా, పంజాబ్, గోవా వంటి రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా మద్యం డోర్ డెలివరీ విధానాన్ని అమలు చేయాలని పరిశ్రమ వర్గాల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈమేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. లాభనష్టాలపై ఓ అంచనాకు వచ్చాక అమలుపై త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నట్లు చర్చ జరుగుతోంది.
స్విగ్గీ, జొమాటో తదితర ఆన్ లైన్ ఫ్లాట్ ఫాంల ద్వారా నచ్చిన ఫుడ్ ను గుమ్మం వద్దకు తెప్పించుకున్నట్లే నచ్చిన బ్రాండ్ మద్యం సీసానూ తెప్పించుకోవచ్చు.. బెంగాల్, ఒడిశా రాష్ట్రాలలో మద్యం డోర్ డెలివరీ విధానం ఇప్పటికే అమలులో ఉంది. ప్రస్తుతం దీనిని మరో ఏడు రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఆన్ లైన్ ఫ్లాట్ ఫాంలతో మద్యం తయారీదారులు చర్చిస్తున్నారు. పరిమిత సంఖ్యలోనే డెలివరీ చేయనున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని పలు జాతీయ మీడియా సంస్థలు కూడా ప్రసారం చేశాయి.
కోవిడ్ -19 సమయంలో మహారాష్ట్ర, ఝార్ఖండ్, చత్తీస్ గఢ్, అస్సాం రాష్ట్ర ప్రభుత్వాలు తాత్కాలికంగా మద్యం హోమ్ డెలివరీకి అనుమతించాయి. వైరస్ వ్యాప్తి తగ్గాక తిరిగి నిషేధం విధించాయి. అయితే, బెంగాల్, ఒడిశాలలో మాత్రం ఇప్పటికీ అది కొనసాగుతోంది. డోర్ డెలివరీకి అనుమతించడం ద్వారా మద్యం అమ్మకాలు 20-30 శాతం పెరిగినట్లు రిటైల్ పరిశ్రమల అధికారులు చెప్పినట్లు జాతీయ మీడియా కథనంలో పేర్కొంది. ఈ విధానం మన రాష్ట్రంలోనూ అమలు చేయాలని హైదరాబాదీలు వందకు వంద శాతం పట్టుబడుతున్నట్లు ఇటీవలి సర్వే ఒకటి బయటపెట్టింది.