Medha Patkar: పరువు నష్టం కేసులో మేధా పాట్కర్ కు 5 నెలల జైలు శిక్ష..!
Medha Patkar: పరువు నష్టం కేసులో మేధా పాట్కర్ కు 5 నెలల జైలు శిక్ష..!
- పరువు నష్టం దావాలో దోషిగా తేల్చిన ఢిల్లీ కోర్టు
- 23 ఏళ్ల నాటి కేసులో తాజాగా తీర్పు.
- జైలు శిక్షతో పాటు రూ.10 లక్షల జరిమానా..
నర్మదా బచావ్ ఉద్యమకర్త మేధా పాట్కర్ కు ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు ఐదు నెలల జైలు శిక్ష విధించింది. 23 ఏళ్ల నాటి పరువు నష్టం కేసులో తాజాగా సోమవారం తీర్పు వెలువరించింది.
అయితే, హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ మేజిస్ట్రేట్ రాఘవ్ శర్మ శిక్ష అమలును నెల రోజుల పాటు సస్పెండ్ చేశారు. జైలు శిక్షతో పాటు ఆమెకు రూ.10 లక్షల జరిమానా కూడా విధించారు.
ఈ కేసు వివరాలు ఏంటి..
ప్రస్తుతం ఢిల్లీ ఎల్జీగా ఉన్న వీకే సక్సేనా గతంలో గుజరాత్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ సమయంలో నర్మదా బచావ్ ఆందోళనకు వ్యతిరేకంగా అడ్వర్టైజ్ మెంట్లు ఇచ్చి మరీ ప్రచారం చేశారంటూ సక్సేనాపై మేధా పాట్కర్ మండిపడ్డారు. సక్సేనా ఓ పిరికిపంద, హవాలా లావాదేవీలు చేశారని పాట్కర్ ఆరోపించారు. 2000 సంవత్సరంలో జరిగిన ఈ వివాదం, పాట్కర్ చేసిన వ్యాఖ్యలపై సక్సేనా కోర్టుకెక్కారు. పాట్కర్ వ్యాఖ్యలతో తన పరువుకు భంగం కలిగిందంటూ దావా వేశారు. దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన కోర్టు.. ఈ ఏడాది మే నెలలో పాట్కర్ ను దోషిగా తేల్చింది. తాజాగా సోమవారం తీర్పు వెలువరిస్తూ.. పాట్కర్ కు ఐదు నెలల జైలు, రూ.10 లక్షల జరిమానా విధించింది.