NH 44: మారనున్న రాయలసీమ ముఖచిత్రం.. హైదరాబాద్-బెంగళూరు మధ్య 12 వరుసల విస్తరణకు నేషనల్ హైవే
NH 44: మారనున్న రాయలసీమ ముఖచిత్రం.. హైదరాబాద్-బెంగళూరు మధ్య 12 వరుసల విస్తరణకు నేషనల్ హైవే
రాయలసీమ ముఖచిత్రం త్వరలో మారిపోనుంది. గతంలో ఎన్నడూలేనంతగా ఆర్థిక, పారిశ్రామిక వృద్ధితో సీమ జిల్లాలు కళకళలాడనున్నాయి.
12 వరుసలుగా విస్తరణకు కేంద్రం సన్నద్ధం దక్షిణాదిలోనే అత్యధిక వరుసల హైవే ఇదే ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఆర్థిక వృద్ధికి దోహదం హైవే వెంట పెద్దఎత్తున పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం
రాయలసీమ ముఖచిత్రం త్వరలో మారిపోనుంది. గతంలో ఎన్నడూలేనంతగా ఆర్థిక, పారిశ్రామిక వృద్ధితో సీమ జిల్లాలు కళకళలాడనున్నాయి. ఇందుకు ప్రధాన కారణం.. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల మీదుగా వెళ్లే హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి (NH-44)ని ఇప్పుడున్న నాలుగు వరుసల నుంచి ఏకంగా 12 వరుసలకు విస్తరించడమే. రెండు మెట్రో నగరాల మధ్య వాహన రద్దీని, భవిష్యత్తు అవసరాలను అంచనా వేసి.. ఈ రహదారిని 12 వరుసలుగా విస్తరించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ జాతీయ రహదారిలో 260 కి.మీ. మన రాష్ట్ర పరిధిలో ఉండటంతో అన్ని విధాలా అభివృద్ధికి అవకాశం ఏర్పడుతోంది.
రహదారుల వెంటే అభివృద్ధి
విశాలమైన రహదారులు, సమీపంలో విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు ఉంటే పారిశ్రామికవేత్తలు ఆ ప్రాంతంపై దృష్టిపెడతారు. దీనికితోడు తక్కువ ధరలకు భూములు లభిస్తే అక్కడ పరిశ్రమలు పెట్టేందుకు పోటీపడతారు. ఇప్పుడు హైదరాబాద్-బెంగళూరు హైవే విస్తీర్ణంతో ఇదే జరగనుంది. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలకు ఈ ప్రయోజనాలన్నీ కలగనున్నాయి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎక్స్ప్రెస్వేల వెంట ఆర్థిక నడవాలు ఏర్పాటు చేసి, వాటికి ప్రోత్సాహకాలు ఇస్తోంది. మరోవైపు అటు కర్ణాటక, ఇటు తెలంగాణకు చెందిన పారిశ్రామికవేత్తలు సీమ జిల్లాలవైపు వచ్చే వీలుంది. కర్ణాటకలోని బెంగళూరు శివారు వరకు భూముల ధరలు భారీగా ఉన్నాయి. అక్కడ నీటి సమస్య కూడా అధిక ఉంది. దీంతో ఆ నగరానికి దగ్గరలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకుంటే. హైవే దగ్గరలో ఉన్న అనంతపురం జిల్లాకు వచ్చేందుకు వీలుంటుంది. ఈ జిల్లాల్లో భూముల ధరలు తక్కువగా ఉండటం, విద్యుత్తు, నీటి కొరత లేకపోవడంతో.. పారిశ్రామికవేత్తలు ఇటు దృష్టిపెడతారు. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెద్దఎత్తున పెరుగుతాయి. తెలంగాణ వైపు కూడా భూముల ధరలు అధికంగానే ఉండటంతో.. అక్కడ కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే వారు.. కర్నూలు జిల్లాలో హైదరాబాద్-బెంగళూరు హైవేకి సమీపంలో భూములను ఎంపిక చేసుకోవచ్చు.
నాలుగు విమానాశ్రయాలకు దగ్గర..
ఈ జాతీయ రహదారికి సమీపంలో నాలుగు విమానాశ్రయాలు ఉండటంతో పారిశ్రామికవేత్తలు దీని వెంట పరిశ్రమల ఏర్పాటుకు మొగ్గు చూపేందుకు వీలుంది.
• బెంగళూరు కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ- కర్ణాటక సరిహద్దు నుంచి కేవలం 80 కి.మీ. దూరంలో ఉంది.
• పెనుకొండ నుంచి పుట్టపర్తి విమానాశ్రయం 25 కి.మీ. దూరంలో ఉంది.
• కర్నూలు నుంచి కేవలం 30 కి.మీ. దూరంలో ఓర్వకల్లు వద్ద విమానాశ్రయం ఉంది.
• కర్నూలు నుంచి తెలంగాణలోని శంషాబాద్ విమానాశ్రయం 195 కి.మీ దూరం ప్రయాణిస్తే చేరుకోవచ్చు.
హైదరాబాద్-బెంగళూరు హైవే విస్తరణతో అనంతపురం, కర్నూలు జిల్లాలు పారిశ్రామిక హబ్స్ మారనున్నాయి.
• ఇప్పటికే అనంతపురం జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కొటిక్స్ (నాసిన్) ఏర్పాటైంది. బీహెచ్ఎఎల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
• గతంలో చంద్రబాబు కృషితో పెనుకొండ వద్ద కియా పరిశ్రమ ఏర్పాటు కావడంతో ఆ ప్రాంత స్వరూపమే మారిపోయింది. పెనుకొండ నుంచి పాలసముద్రం వరకు దాదాపు 30 కి.మీ. మేర 18 అనుబంధ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి.
• విద్యుత్ బస్సులు, విమానాల విడిభాగాలు తయారుచేసే సంస్థలకు ఈ ప్రాంతంలోనే భూములు కేటాయించారు.
• జాతీయ రహదారి 12 వరుసలతో విస్తరణతో పెద్ద సంఖ్యలో కొత్త పరిశ్రమలు వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది.
• ఈ హైవే చుట్టుపక్కల ప్రభుత్వ భూములు గుర్తించి.. వాటిలో ఏపీఐఐసీ పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటుచేస్తే.. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కూడా ఈ ప్రాంతాలకు వరుస కడతాయి.
ఏపీలోనే అత్యధిక విస్తీర్ణం
హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారి విస్తీర్ణం 576 కీ.మీ.
• ఏపీలో 260 కీ.మీ.
• తెలంగాణలో 210 కి.మీ.
• కర్ణాటకలో 106 కి.మీ.
• ఈ హైవేలో మన రాష్ట్రంలోని కర్నూలు వద్ద మొదలై శ్రీసత్యసాయి జిల్లాలోని కొండికొండ వద్ద ముగుస్తుంది.
• కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, పెనుకొండ మీదుగా ఈ హైవే వెళ్తుంది.
• ఇదంతా 12 వరుసలుగా విస్తరించనున్నారు.