-Advertisement-

Olympics: విశ్వక్రీడలకు వేళాయే.. నేటి నుంచి పారిస్ ఒలింపిక్స్ షురూ..!

2024 Summer Olympics Olympics telugu Olympics 2028 Olympics history Summer Olympic Games Olympics schedule Winter Olympics Olympics Games Medals list
Peoples Motivation

Olympics: విశ్వక్రీడలకు వేళాయే.. నేటి నుంచి పారిస్ ఒలింపిక్స్ షురూ..!

• భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు మొదలవనున్న పారిస్ ఒలింపిక్స్..

• భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు..

• ఒలింపిక్స్ ఆధునిక ఒలింపిక్ చరిత్రలో 33వ క్రీడలు..

ఆధునిక ఒలింపిక్ చరిత్రలో ఇవి 33వ క్రీడలు. విశ్వ క్రీడా సంబురానికి వేళైంది. నాలుగేళ్లకోసారి జరిగే సమ్మర్ ఒలింపిక్స్ ఈ సారి మూడేళ్లకే వచ్చాయి. 2020లో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ కరోనా కారణంగా 2021లో జరిగిన విషయం తెలిసిందే.

ఈ సారి విశ్వక్రీడలకు పారిస్ ఆతిథ్యమిస్తున్నది. ఈ క్రీడా సంబురానికి పారిస్ ముస్తాబైంది. నేటి నుంచి ఒలింపిక్స్ అధికారికంగా ప్రారంభంకానున్నాయి. ఆగస్టు 11 తేదీన క్రీడా సమరం ముగియనుంది. 32 క్రీడా అంశాల్లో 329 ఈవెంట్లలో పతక పోటీలు జరగనున్నాయి. 206 దేశాల నుంచి 10, 500 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు బరిలో ఉన్నారు.

2024 Summer Olympics Olympics telugu Olympics 2028 Olympics history Summer Olympic Games Olympics schedule Winter Olympics Olympics Games Medals list
ప్రారంభ వేడుకలు ఈ సారి భిన్నంగా..!

ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలను నిర్వాహకులు ఈ సారి భిన్నంగా నిర్వహించ బోతున్నారు. సాధారణంగా వేడుకలను స్టేడియంలో నిర్వహిస్తారు. కానీ, సంప్రదాయానికి భిన్నంగా ఈ సారి నిర్వాహకులు స్టేడియంలో కాకుండా పారిస్ మీదుగా ప్రవహించే సెయిన్ నదిపై నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపుగా 10 వేలకుపైగా మంది అథ్లెట్లు 100 పడవలపై పరేడ్‌లో పాల్గొంటారు. 6 కిలో మీటర్ల మేర ఈ పరేడ్ జరుగుతుంది. ఆస్టర్లిట్జ్ బ్రిడ్ వద్ద ప్రారంభయ్యే పరేడ్ ట్రోకాడెరో వద్ద ముగుస్తుంది. అక్కడ మిగతా ప్రదర్శనలు జరుగుతాయి. దాదాపు మూడు గంటలపాటు ఓపెనింగ్ సెర్మనీ జరగనుంది. 

ఓపెనింగ్ సెర్మనీని ఎక్కడ చూడొచ్చంటే..

భారత కాలమానం ప్రకారం నేడు రాత్రి 11 గంటలకు ప్రారంభ వేడుకలు మొదలవుతాయి. భారత్‌లో స్పోర్ట్స్ 18 1 ఎస్‌డి, 1 హెచ్‌డి చానెల్స్‌లో లైవ్ టెలికాస్ట్ కానుంది. జియో సినిమా యాప్‌లోనూ ఫ్రీగా చూడొచ్చు.

భారత్ నుంచి 16 క్రీడల్లో 117 అథ్లెట్లు...

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ తరపున 117 మంది అథ్లెట్లు ప్రాతినిధ్యం వహించనున్నారు. వారు 16 క్రీడా అంశాల్లో బరిలో ఉన్నారు. అథ్లెటిక్స్‌లో అత్యధికంగా 29 మంది పోటీపడుతున్నారు. ఆ తర్వాత షూటింగ్‌లో 21 మంది పాల్గొంటున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో అత్యధికంగా 121 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సారి మహిళల హాకీ జట్టు ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేదు.

అంచనా వ్యయం..

రూ.1.17 లక్షల కోట్లు పారిస్ ఒలింపిక్స్ అంచనా వ్యయం. కోటి 10 లక్షల మంది పర్యాటకులు పోటీలను వీక్షించనున్నారు.

రెండేసి విభాగాల్లో పోటీపడుతున్నవారు..

పారుల్ చౌదరి (5 వేలు, 3 వేలు మీటర్ల స్టీపుల్ చేజ్), మను బాకర్ (30 మీటర్ల ఎయిర్ పిస్టల్, 25 మీటర్ల ఎయిర్ పిస్టల్) రెండేసి విభాగాల్లో పోటీపడుతున్నారు..

ఇప్పటివరకు భారత సాధించిన పతకాలు..

ఒలింపిక్ లో భారత్ సాధించిన మొత్తం పతకాలు 35, ఇందులో 10 స్వర్ణా లున్నాయి. వీటిలో 8 హాకీలో సాధిం చినవే. అభినవ్ బింద్రా (షూటింగ్), నీరజ్ చోప్రా (జావెలిన్ ) చెరో పసిడి దక్కించుకున్నారు.

ఫ్లాగ్ బేరర్స్‌గా సింధు, శరత్ కమల్..

తెలుగు తేజం, స్టార్ షట్లర్ పీవీ సింధు, సీనియర్ టేబుల్ టెన్నిస్ ఆటగాడు శరత్ కమల్ భారత్ తరఫున ఫ్లాగ్ బేరర్స్‌గా ఎంపికయ్యారు. ఓపెనింగ్ సెర్మనీలో భారత బృందాన్ని సింధు, శరత్ కమల్ నడిపించనున్నారు. సింధు, శరత్ త్రివర్ణ పతాకాన్ని చేతబూని ముందు నడవనున్నారు. ఈ గౌరవం దక్కడం పట్ల సింధు సంతోషం వ్యక్తం చేసింది. ఒలింపిక్స్‌లో జాతీయ జెండాను మోసేవారిగా ఉండే అవకాశం ఒక్కసారే లభిస్తుందని, తనకు ఇది చాలా గర్వకారణమని చెప్పింది. శరత్‌కు ఇవి 5వ ఒలింపిక్స్ అవ్వగా సింధు వరుసగా మూడో సారి పాల్గొంటుంది. 

తెలుగు రాష్ట్రాల నుంచి 8 మంది..

తెలుగు రాష్ట్రాల నుంచి 8 మంది అథ్లెట్లు ఈ విశ్వక్రీడల్లో పాల్గొంటున్నారు. తెలంగాణ నుంచి నిఖత్ జరీన్(బాక్సింగ్), ఇషా సింగ్(షూటింగ్), ఆకుల శ్రీజ(టేబుల్ టెన్నిస్), పీవీ సింధు(బ్యాడ్మింటన్) బరిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ధీరజ్ బొమ్మదేవర(ఆర్చరీ), జ్యోతి యర్రాజి(అథ్లెటిక్స్), జ్యోతిక శ్రీ(అథ్లెటిక్స్), సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి(బ్యాడ్మింటన్) పాల్గొంటున్నారు. నిఖత్ జరీన్, సింధు, సాత్విక్‌లపై పతక ఆశలు భారీగా ఉన్నాయి.

Comments

-Advertisement-