Suspend: రోడ్డు పై మందేసి, చిందేసిన ఏఎస్సై.. సస్పెండ్ చేసిన ఎస్పీ.!
Suspend: రోడ్డు పై మందేసి, చిందేసిన ఏఎస్సై.. సస్పెండ్ చేసిన ఎస్పీ.!
- వీడియో తీసి ఉన్నతాధికారులకు పంపిన శంకరాపురం గ్రామస్థులు..
- పికెటింగ్ డ్యూటీ చేయకుండా రోడ్డు పక్కనే ఏఎస్సై మద్యపానం..
- ఏఎస్సైని సస్పెండ్ చేసిన ఎస్పీ గరుడ్ సుమిత్..
గ్రామంలో గొడవలు జరగకుండా కాపలా కోసం నియమించిన ఓ పోలీసు అధికారి విధినిర్వహణ పక్కన పెట్టి మందేసి చిందేశాడు.. గ్రామ శివార్లలో మందుబాబులతో కలిసి సదరు పోలీస్ ఎంజాయ్ చేస్తుండగా గ్రామస్థులు వీడియో తీసి ఉన్నతాధికారులకు పంపించారు. దీంతో వెంటనే స్పందించిన ఎస్పీ.. సదరు ఏఎస్సైని అక్కడికక్కడే సస్పెండ్ చేశారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండల పరధిలోని శంకరాపురంలో చోటుచేసుకుందీ ఘటన. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
శంకరాపురంలో ఇటీవల ఇరు పార్టీల మధ్య వివాదం రేగింది. రెండు వర్గాలుగా విడిపోయిన గ్రామస్థులు దాడులు చేసుకున్నారు. దీంతో ముగ్గురు గ్రామస్థులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రత్యర్థి వర్గంపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ క్రమంలో గ్రామంలో మరోమారు వివాదం చెలరేగకుండా పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. అక్కడ ఏఎస్సై వెంకటేశ్వర్లుకు డ్యూటీ వేశారు. విధినిర్వహణలో భాగంగా గ్రామానికి వచ్చిన ఏఎస్సై వెంకటేశ్వర్లు.. తను వచ్చిన పని మానేసి గ్రామ శివార్లలో మందుబాబులతో కలిసి మద్యపానం చేశాడు.
మందుబాబులలో ఒకరు డ్యాన్స్ చేస్తుంటే ఈల వేస్తూ ఎంకరేజ్ చేశాడు. మరో మందుబాబు ఇదంతా తన ఫోన్ లో రికార్డు చేసి వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేశాడు. వైరల్ గా మారిన ఈ వీడియోను కొంతమంది ఉన్నతాధికారులకు పంపించారు. రోడ్డు పక్కన యూనిఫాంలోనే మందు కొడుతున్న వెంకటేశ్వర్లు నిర్వాకం ఈ వీడియోలో స్పష్టంగా కనిపించడంతో ఎస్పీ గరుడ్ సుమిత్ వెంటనే స్పందించారు. ఏఎస్సై వెంకటేశ్వర్లను సస్పెండ్ చేసి రిజర్వ్ కు పంపించారు. దీనిపై ఐజీ ఆఫీసుకు నివేదిక పంపినట్లు అధికార వర్గాల సమాచారం.