జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.10 వేల గౌరవ వేతనం.. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు
జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.10 వేల గౌరవ వేతనం.. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు
• 100 ఎకరాల్లో అమరావతిలో లీగల్ కాలేజ్
• నిందితులకు శిక్ష పడేలా ప్రాసిక్యూషన్ ఉండాలి
• న్యాయశాఖ సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన
అమరావతి, (పీపుల్స్ మోటివేషన్):-
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి పంపుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.
సోమవారం సచివాలయంలో న్యాయశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. రాజధాని అమరావతిలో 100 ఎకరాల విస్తీర్ణంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా ఇంటర్నేషన్ లా స్కూల్ ఏర్పాటును ముందుకు తీసుకువెళ్లాలని సీఎం సూచించారు. బెంగుళూరుకు చెందిన నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, గోవాలోని ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యుత్తమ ఇనిస్టిట్యూట్ ను అమరావతిలో ఏర్పాటు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.
జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.10 వేల గౌరవ వేతనం..
అదే విధంగా జూనియర్ న్యాయవాదులకు నెలకు గౌరవ వేతనం కింద రూ.10 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పామని...ఆ మేరకు చెల్లించేందుకు ప్రక్రియ ప్రారంభించాలని సీఎం అధికారలకు సూచించారు. జూనియర్ న్యాయవాదులకు శిక్షణ కేంద్రం కోసం అకాడమీ ఏర్పాటు అంశంపైనా కసరత్తు చేయాలని సూచించారు. అనంతరం ప్రాసిక్యూషన్ విభాగంపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. నమోదైన కేసులు, రుజువైన నేరాల అంశంలో శిక్షపడే శాతం పెరగాలని...దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేసే పద్దతులను అవలంభించాలని సీఎం సూచించారు. తప్పు చేసిన వారికి శిక్ష పడుతుంది అనే నమ్మకం కలిగేలా ప్రాసిక్యూషన్ ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడే విషయంలో లిటిగేషన్లు పెట్టాలే కానీ...అనవసర వివాదాలు తెచ్చేలా లిటిగేషన్ ప్రభుత్వం నుంచి ఉండకూడదని సీఎం వ్యాఖ్యానించారు. న్యాయ శాఖపై మరింత సమగ్రంగా సమీక్ష చేయాల్సి ఉందన్నముఖ్యమంత్రి...మరిన్ని వివరాలతో రావాలని అధికారులను ఆదేశించారు.