సైబర్ క్రైమ్, ఫేక్ లోన్ యాప్స్, ఆన్లైన్ గేమింగ్ ద్వారా జరిగే మోసాలపై జాగ్రత్త !!!
సైబర్ క్రైమ్, ఫేక్ లోన్ యాప్స్, ఆన్లైన్ గేమింగ్ ద్వారా జరిగే మోసాలపై జాగ్రత్త !!!
>> సైబర్ క్రైం ఏ రూపంలో వస్తుందో తెలీదు... అప్రమత్తంగా ఉంటూ నివారించడమే ఉత్తమ మార్గం...
>> మత్తు ఓక వ్యసనం అది పట్టుకుంటే వదలదు.. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి...
>> రహదారి భద్రత నియమాలను ప్రతి ఒక్కరూ పాటించి, రోడ్డు ప్రమాదాలు నివారించడంలో భాగస్వాములు కండి...
>> హెల్మెట్ ధరించి ద్విచక్రవాహనాలను నడిపి, ఇతరులకు ఆదర్శంగా నిలవండి...
>> జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్. ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న జిల్లా పోలీసులు...
తిరుపతి, సెప్టెంబర్ 17 (పీపుల్స్ మోటివేషన్):-
సమాజ సేవ ప్రజాశేయస్సే పరమావధిగా భావించి ప్రస్తుత సమాజంలో పెను భూతాలుగా పరిణమిస్తున్న మత్తు పదార్థాలు, సైబర్ క్రైమ్, మహిళలపై జరిగే అఘాయిత్యాలు వాటి నివారణ మార్గాలు, పోక్సో చట్టం దాని ఆవశ్యకత, రహదారి భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ వాడకం యొక్క ఆవశ్యకతలను గురించి అవగాహన సదస్సులు నిర్వహించి విద్యార్థులు / ప్రజలను చైతన్యపరిచి ఆదర్శవంతమైన నవ సమాజ నిర్మాణం కోసం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో అహర్నిశలు జిల్లా పోలీసులు పనిచేస్తున్నారు. ఈ విషయాలపై ప్రజలకు కచ్చితమైన అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్., జిల్లా పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఉన్నారు.
ఇందులొ భాగంగా జిల్లా వ్యాప్తంగా ఈ రోజు పోలీసులు స్కూల్ పిల్లలకు అలాగె గ్రామస్థులతో గ్రామ సభ ఏర్పాటు చేసి పై విషయాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.
సైబర్ నేరాలు:-
అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే లింక్‌లపై క్లిక్ చేసేటప్పుడు లేదా డౌన్‌లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బలమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌లను మరియు మన్నికైన యాంటీవైరస్ ప్రోగ్రాం ను ఉపయోగించాలి. వ్యక్తిగత సమాచారాన్ని లేదా ఓటీపీలను ఎవరితోనూ పంచుకోకూడదు. అలాగే సైబర్ క్రైమ్, ఫేక్ లోన్ యాప్స్, ఆన్లైన్ గేమింగ్ ద్వారా జరిగే మోసాలపై ప్రజలకు, ఉద్యోగులకు తెలియజేసి నివారణ మార్గాన్ని అనుసరించాలి.
మత్తు పదార్థాలు దుర్వినియోగం.. పర్యవసానాలు:-
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి.. ఒక్కసారి అలవాటు పడితే అవి మీ జీవితాన్ని మరియు మీ చుట్టూ ఉన్న వారి జీవితాలను నాశనం చేస్తాయి. మీరు లేదా మీకు తెలిసిన ఎవరైనా వ్యసనంతో ఇబ్బంది పడుతుంటే టోల్ ఫ్రీ నెంబర్ 14446 ను సంప్రదించి సహాయం పోరాలి. మీకు ఎవరికైనా మాదకద్రవ్యాల సంబంధిత కార్యకలాపాల సమాచారం తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ వాట్సాప్ నెంబర్ 80999 99977 కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. మాదక ద్రవ్యాలు లేని సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.
హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యత:-
ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు ఎల్లప్పుడూ హెల్మెట్ ధరించండి. అది మీ జీవితాన్ని కాపాడుతుంది. హెల్మెట్ సరిగ్గా తలకు బిగించుకున్నదో లేదో తెలుసుకుని సురక్షితంగా గమ్యాన్ని చేరండి. చెల్లుబాటు అయ్యే ISI గుర్తు ఉన్న హెల్మెట్ ధరించాలి. దెబ్బతిన్న హెల్మెట్‌ను ఉపయోగించడం దుర్లభం. ద్విచక్ర వాహనదారులు ఎల్లప్పుడూ హెల్మెట్ ధరించి ఇతరులకు ఆదర్శంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు శిరస్త్రాణం (హెల్మెట్) ధరించాలి. ప్రమాద సమయంలో శిరస్త్రాణం వలన కలిగే ప్రయోజనాల గురించి తెలియజేశారు.
బాలికలు, మహిళలపై జరిగే అఘాయిత్యాల నివారణ చర్యలు:-
బాలికలు, మహిళల రక్షణకై పోలీస్ శాఖ కట్టుబడి ఉంది. వారిపై ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటాము. చిన్నపిల్లలు, బాలికలపై లైంగిక దాడి చేసినా లేదా వేధింపులకు గురిచేసిన వారిపై వెంటనే రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాం. వారి ప్రవర్తన మార్చుకోకుండా పదేపదే లైంగిక దాడి చేస్తే పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు పంపుతాం. బాలికలు మహిళలు ఏదైనా ఆపద్ సమయంలో డయల్ 100 లేదా 112 లేదా కంట్రోల్ రూమ్ వాట్సాప్ నెంబర్ 8099999977 లను సంప్రదించి పోలీసులు వారి సహాయాన్ని తక్షణమే పొందాలని సూచించారు. ఈ సృష్టికి మూలం ఒక స్త్రీ కాబట్టి అటువంటి స్త్రీలను కాపాడుకోవాల్సిన మహాతర బాధ్యత మనందరిపై ఉందని పిలుపునిచ్చారు.
రహదారి భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు:-
రహదారులపై విధిగా సిగ్నల్ వ్యవస్థను పాటించాలి. యూటర్న్ తీసుకునేటప్పుడు ముందస్తు ఇండికేషన్ సిగ్నల్ ను ఉపయోగించి వెనక వైపు ముందు వైపు వస్తున్న వాహనాలను గమనించి జాగ్రత్తగా దారి మళ్లించుకోవాలి. రోడ్డుపై అడ్డదిడ్డంగా వాహనాలను నిలపరాదు. రోడ్డుకి పూర్తి ఎడమవైపున మాత్రమే వాహనాలను నిలిపి ప్రయాణికులను ఎక్కించుకోవాలి లేదా దింపాలి. రహదారిపై మీ కళ్ళ ముందు ఏదైనా అనుకోని సంఘటన జరిగితే వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు, డయల్ 108 ద్వారా అంబులెన్స్ సేవలకు సమాచారం ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ బాధ్యత గల పౌరులుగా ట్రాఫిక్ నియమాలను రహదారి భద్రత నియమాలను పాటించి మెరుగైన సమాజం నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా చేపట్టారు.