సామాన్యుడికి భారంగా వంట నూనెల ధరలు..
సామాన్యుడికి భారంగా వంట నూనెల ధరలు..
>> 20 శాతం దిగుమతి సుంకాన్ని పెంచిన కేంద్రం...
>> పలు దేశాల నుంచి ఆయిల్ దిగుమతి...
>> పండుగలకు పిండి వంటలకు అధికంగా వంట నూనెలు...
పండుగల సీజన్ మొదలు.. వినాయకచవితితో మొదలై సంక్రాంతి వరకు పలు పండుగలకు పిండి వంటలకు అధికంగా వంట నూనెలు వినియోగిస్తారు. వచ్చే 3, 4 నెలల్లో దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి వంటి పండుగ దినాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వంట నూనెల ధరలు గరిష్ట స్థాయికి తీసుకుపోతారని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ నిల్వలపై సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించి వంట నూనెల ధరలు స్థిరీకరించాలని గృహిణులు కోరుతున్నారు. వంట నూనెల ధరలు పెరిగితే పరోక్షంగా అన్ని ఆహార ధరలు పెరుగుతాయని ఆందోళన చెందుతున్నారు. వంట నూనెల పెరుగుదల బూచితో ధరలు పెంచివేస్తారని భావిస్తున్నారు.
పెరిగిన వంట నూనె ధరలు...
వంట నూనెల దిగుమతి సుంకాన్ని 20 శాతంపెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో అన్ని రకాల నూనె ధరలు లీటరుపై రూ.15 నుంచి రూ.20 వరకు పెరిగాయి.పామాయిల్ రూ.100 నుంచి 115, సన్ ఫ్లవర్ రూ.115 నుంచి రూ.130-140, వేరుశనగ నూనె రూ.155 నుంచి రూ.165, పూజలకు ఉపయోగించే నూనెలను రూ.110 నుంచి 120కి చేరాయి.
విదేశాల నుంచి...
ఇండోనేషియా, మలేషియా దేశాల నుంచి మనకు పామాయిల్ దిగుమతి అవుతుండగా రష్యా, అర్జంటీనా, ఉక్రెయిన్ దేశాల నుంచి సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి అవుతోంది. ఇప్పుడు దిగమతి సుంకం పెంపుతో ఆయా ఆయిల్ కంపెనీలు ధరలు పెంచడానికి మాఫియా వర్గాలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. సుమారు నెలకు సరిపడా వంట నూనెల ఉత్పత్తులను టోకు వర్తకులు నిల్వ చేసి ఉంచుతారు. దిగుమతి సుంకాన్ని పెంచుతూ కేంద్రం నిర్ణయంతీసుకున్న వెంటనే లీటరు వంట నూనెపై రూ.10 పెంచి ఇప్పుడు తాజాగా రూ.20కు తీసుకువచ్చారు.