MP Salary: లోక్‌సభకు ఎన్నికైన ఎంపీల జీతం ఎంత?.. ఇతర అలవెన్సెస్ గురించి తెలుసా..?
MP Salary: లోక్‌సభకు ఎన్నికైన ఎంపీల జీతం ఎంత?.. ఇతర అలవెన్సెస్ గురించి తెలుసా..?
లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన పార్లమెంట్ సభ్యులకు కేంద్రం అన్ని రకాల సదుపాయాలనూ కల్పిస్తుంది. నెలకు రూ.లక్ష జీతం, ఉచిత వసతి సౌకర్యం అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఎంపీల జీతాలు, ఇతర ప్రోత్సాహకాల (Allowances and Perks) గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాయి. మరో రెండు రోజుల్లో కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎన్డీయే కూటమికి 292 సీట్లు రాగా, ఇండియా కూటమికి 232 సీట్లు వచ్చాయి. ఇక కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక వారికి ఢిల్లీలో కేంద్రం అన్ని రకాల సదుపాయాలనూ కల్పిస్తుంది. ప్రతి ఎంపీ నెలకు రూ.లక్ష జీతం, వసతి, ఉచిత విదేశీ ప్రయాణాలు.. సహా ఇతర అలవెన్సెస్‌లు పొందుతారు. ఈ నేపథ్యంలో ఎంపీల జీతాలు, ఇతర ప్రోత్సాహకాల (Allowances and Perks) గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతి ఎంపీ నెలకు రూ.లక్ష జీతం అందుకుంటారు. నియోజకవర్గ అలవెన్సెస్ కింద నెలకు రూ.70 వేలు, ఆఫీస్ ఖర్చుల కింద నెలకు మరో రూ.60 వేలు కూడా ప్రతీ ఎంపీకి చెల్లిస్తారు. ఇందులో స్టేషనరీ, టెలికమ్యూనికేషన్ సిబ్బంది జీతాలు మొదలైనవి ఉంటాయి. ఇవే కాకుండా.. పార్లమెంటరీ సెషన్‌ల సమయంలో ఎంపీలకు రోజుకు రూ.2 వేలు అదనంగా చెల్లిస్తారు.
ఏడాదిలో 34 సార్లు ఎంపీతో పాటు ఆయన భార్యకు ఉచిత విమాన ప్రయాణం కల్పిస్తారు. అధికారిక, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉచిత ఫస్ట్-క్లాస్ రైలు ప్రయాణం కూడా చేయొచ్చు. ఇక రోడ్డు రవాణా అయితే, కిలోమీటరుకు రూ.16 చొప్పున చెల్లిస్తారు.
ఎంపీలకు 5 సంవత్సరాల పదవీకాలంలో అద్దె రహిత వసతి కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం. సీనియారిటీని బట్టి బంగ్లాలు, ఫ్లాట్లు, హాస్టల్ గదుల్లో ఫ్రీగా ఉండే వెసులుబాటు ఉంటుంది. అధికారిక వసతి వద్దనుకున్న వారు నెలకు రూ.2,00,000 గృహ భత్యాన్ని క్లెయిమ్ చేసుకునే వీలుంటుంది.
ఎంపీలు, వారి కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) కింద ఆరోగ్య సేవలు ఉచితంగా పొందవచ్చు. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు.. ఈ పథకం కింద వచ్చే ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ వైద్య సేవలను ఉచితంగా పొందొచ్చు. పదవి కోల్పోయిన అనంతరం మాజీ ఎంపీలకు ఒక్కొక్కరికి నెలకు రూ.25 వేల పింఛన్ సైతం వస్తుంది. ప్రతి ఏడాది నెలకు రూ.2,000 ఇంక్రిమెంట్ కూడా పొందుతారు.
మూడు టెలిఫోన్లను ఉపయోగించుకోవచ్చు. వాటిని తనకు ఇష్టమైన చోట ఏర్పాటు చేసుకోవచ్చు. ఏడాదిలో ఎంపీలకు 1,50,000 టెలిఫోన్ కాల్స్ ఫ్రీ. వారు తమ నివాసాలు, కార్యాలయాల్లో ఉచిత హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్‌లను కూడా పొందుతారు. ఏటా 50,000 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 4,000 కిలోలీటర్ల వరకు ఉచిత నీరు అందిస్తారు.